వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఒక వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. నడుస్తూ వెళ్తుండగా ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అంటూ జగన్ ప్లకార్డు పట్టుకుని అడుగుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది. ట్విట్టర్లో ఉన్న ఆ పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అలా చేయటం సరికాదంటూ సున్నితంగా మందలించారు.
టీడీపీ కుటుంబ సభ్యులకు హితవు పలికారు. అలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకుంటాను అన్నారు. అయినప్పటికీ వ్యక్తిగత దాడులు ఎప్పుడూ సముచితం కావని హితవు పలికారు. మనం రాజకీయ ప్రత్యర్థులైనా, ప్రజా జీవితంలో గౌరవం, మర్యాదలు తప్పనిసరి అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహా ఎవరూ ఇలాంటి విషయాలను ప్రోత్సహించకూడదని కోరారు. విభేదాలు ఉన్నా నాగరికతను పాటించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి తోడ్పడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మన దృష్టి ఉండాలి అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి వీడియోను జత చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా పోస్టులపై ఒక దృష్టి పెట్టింది. తప్పుగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలను చేపడుతోంది. జగన్ సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు మంత్రులతో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా తమ ప్రభుత్వం వైఖరిని తెలియజేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే నారా లోకేష్ తన పొలిటికల్ ప్రత్యర్థులపై సహేతుకమైన విమర్శలు మాత్రమే చేస్తుంటారు. వ్యక్తిగత విమర్శలకు ఆయన తావు ఇవ్వరు అనే పేరు ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు జగన్ పై తమ పార్టీ వారు తయారు చేసినఏఐ క్రియేట్ వీడియోను ఆయన తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు తగవని హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates