ఎమ్మెల్యే తమ్ముడి 80 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసిన ఈడీ

తెలంగాణ‌లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. బీఆర్ ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి సోద‌రుడు గూడెం మ‌ధుసూద‌న్ రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల‌పై సోమ‌వారం ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. ఈ క్ర‌మంలో మ‌ధుసూద‌న్ రెడ్డికి చెందిన సుమారు 80 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆస్తుల‌ను ఈడీ అటాచ్‌(స్వాధీనం) చేసుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు జ‌రిగిన దాడుల విష‌యాన్ని ఈడీ అధికారులు గోప్యంగా ఉంచారు.

ఎందుకు?

గూడెం మ‌ధుసూద‌న్ రెడ్డి.. రాష్ట్రంలోనే కాకుండా.. ఏపీలోనూ.. గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ఈయ‌న గ‌త రెండు ద‌శాబ్దాలుగా `సంతోష్ శాండ్ అండ్ మైనింగ్‌` కంపెనీని ర‌న్ చేస్తున్నారు. అటు గ్రానైట్‌, ఇటు ఇసుక స‌హా ఇత‌ర ఖ‌నిజాల వ్యాపారం చేస్తు న్నారు. అయితే.. బీఆర్ ఎస్ హ‌యాంలో అక్ర‌మాలు చేశార‌న్న వాద‌న వినిపించింది. దీనిపై అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేశారు. గూడెం బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయాల‌ను అడ్డుపెట్టుకుని అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస‌గౌడ్ ప‌లు సంద‌ర్భాల్లో ఆరోపించారు.

తాజాగా ఇదే కేసు విష‌యంలో ఈడీ అధికారులు మ‌ధుసూద‌న్ ఇల్లు, కార్యాల‌యాల‌పై దాడులు నిర్వ‌హించారు. హైద‌రాబాద్ స‌హా ప‌టాన్ చెరు.. ఏపీలోని మ‌రో ప్రాంతంలోనూ సోదాలు చేప‌ట్టి.. 300 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాల‌కు సంబంధించిన విషయాల‌పై ఆరా తీశారు. అదేస‌మ‌యంలో ఎలాంటి లెక్క‌లూ చూప‌ని కొంత న‌గ‌దుతోపాటు.. 80 కోట్ల రూపాయ‌ల మేర‌కు విలువైన ఆస్తుల‌ను కూడా అటాచ్ చేశారు. మ‌రోవైపు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన రాయ‌ల్టీని కూడా మ‌ధుసూద‌న్ రెడ్డి ఎగ్గొట్టార‌న్న ప్ర‌చారం ఉంది. దీనిపై కూడా ఈడీ అధికారులు కేసులు న‌మోదుచేసి విచారిస్తున్నారు. దీని విలువ సుమారు 30 కోట్ల రూపాయ‌ల వ‌రకు ఉంటుంద‌ని అంటున్నారు.

వ‌రుస విజ‌యాలు..

ఈడీ కేసును ప‌క్క‌న పెడితే.. గూడెం మ‌హిపాల్ రెడ్డి.. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు. బీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు.. మూడు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. కాగా.. గ‌త ఏడాది జూలైలో ఆయ‌న పార్టీ ఫిరాయించారు. ఈ క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్ర‌స్తుతం ఈయ‌న‌పై కూడా అన‌ర్హ‌త వేటు వేయాల‌ని బీఆర్ఎస్ కోరుతోంది. ఇటీవ‌ల‌.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ముందుకు వ‌చ్చిన గూడెం.. ఆస‌క్తిక‌ర వివ‌ర‌ణ ఇచ్చారు. కేసీఆర్ దేవుడ‌ని.. తానుబీఆర్ ఎస్‌లోనే ఉన్నాన‌ని.. ముఖ్య‌మంత్రిని గౌర‌వంగా ప‌ల‌క‌రించేందుకు మాత్ర‌మే ఆయ‌న‌ను క‌లుసుకున్నాన‌ని చెప్పారు.