
వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వ్యవహరించిన తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని, కోట్ల మంది హిందువుల విశ్వాసాలను వమ్ము చేశారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అప్పటి పాలక మండలి నకిలీ నెయ్యిని అనుమతించడం, దానితోనే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడం వంటివి తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సీబీసీఐడీ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.
ఇటీవల సీబీఐ అధికారులు తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు. అదేవిధంగా ఈ కేసును విచారిస్తున్న స్థానిక కోర్టుకు కూడా ఇచ్చారు. ఈ నివేదికలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే జంతువుల కొవ్వు కాకుండా పామాయిల్ సహా ప్రత్యేక రసాయనాలను వినియోగించి ఈ లడ్డూలను తయారు చేసినట్టు నివేదికలో స్పష్టం చేశారు. ఈ నివేదికలో ఎక్కడా జంతువుల కొవ్వు గురించి ప్రస్తావించలేదు. కానీ కల్తీ నెయ్యిని మాత్రం వినియోగించారని తెలిపారు. నిజానికి నెయ్యి తయారు చేయాలంటే పాలు లేదా వెన్నను సేకరించాలి. దాని నుంచి నెయ్యిని తయారు చేయాలి.
అయితే బోలేబాబా సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టులో వారు ఎక్కడా పాలు సేకరించలేదని, అదేవిధంగా వెన్నను కూడా సేకరించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రసాయనాలు, పామాయిల్‌ను వినియోగించి పాలు లేని నెయ్యిని తయారు చేశారని పేర్కొన్నారు. మొత్తం 64 లక్షల కిలోల నెయ్యిని ఈ విధంగా టీటీడీ బోర్డు అప్పట్లో సేకరించినట్టు తెలిపారు. దీనినే లడ్డూ ప్రసాదానికి వినియోగించినట్టు వివరించారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించింది. తాజాగా ఈ మీడియా క్లిప్పులను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ నాడు జరిగిన ఘటన కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచిందన్నారు.
2019 నుంచి 24 మధ్య తిరుమలకు రోజుకు 60 వేల మంది భక్తులు వచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీరిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులతో పాటు వీఐపీలు కూడా ఉన్నారని చెప్పారు. ఇక సాధారణ భక్తులు 10 కోట్ల మంది వరకుండారని తెలిపారు. వీరంతా నకిలీ లడ్డూలు తీసుకున్నారని చెప్పారు. ఇది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేయడమేనని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వాసాలను విచ్ఛిన్నం చేయడమేనని పేర్కొన్నారు. కాగా నకిలీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డిలను కూడా దర్యాప్తు అధికారులు విచారించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates