రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, హెల్త్ కార్డ్.. ఇవన్నీ కాదు. ఏపీలో ఇప్పుడు కొత్తగా మరో కార్డు వస్తోంది. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సమగ్ర సమాచారంతో ఫ్యామిలీకి ఒకటే కార్డ్ తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు.
సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు.
ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు. వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు , స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు.
ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలూ ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates