ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు. మొదట్లో మంగళగిరిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన లోకేష్ ఆ తర్వాత తాను ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ స్థానికులకు సమయం కేటాయిస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు చేరువగా ఉండేందుకు లోకేష్ తీసుకు వచ్చిన ఈ ప్రజాదర్బార్ కు కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోని ప్రజలు కూడా ప్రజాదర్బార్ కు వచ్చి లోకేష్ కు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అయితే వెంటనే అధికారులకు వాటిని అందించి సమస్యలకు పరిష్కారం దొరికేలా నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఈ రోజు పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్ లో ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్… ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన డి.లోకేష్ విజ్ఞప్తి చేశారు.
సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన రెండున్నర సెంట్ల ఇంటి స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో హనుమంతరెడ్డి ఆక్రమించారని, విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ముదిగుబ్బ మండలం మాకర్లకుంటపల్లికి చెందిన టి.నాగభూషణం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎంఏ బీఈడీ చదివిన తనకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని పుట్టపర్తికి చెందిన ఎన్.జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates







