వైసిపి అధినేత జగన్ కి ఇప్పుడు పార్టీ నాయకులను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయినా అనేక నియోజకవర్గాల్లో నాయకులు సమన్వయం లేకపోవడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా వ్యవహరిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ అధినేత దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 130 స్థానాలకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గడిచిన 17 మాసాలుగా నిర్వహించిన కార్యక్రమాలు… వాటిలో ఎంతమంది నాయకులు పాల్గొన్నారు అనే విషయాలపై జగన్ దృష్టిపెట్టారు. అదే సమయంలో పార్టీలో ఉంటూ అధికార పార్టీతో కుమ్మక్కైన నాయకులు ఎవరనే విషయంపై కూడా ఆయన నిశితంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. వీరి వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే అలాగని 130 నియోజకవర్గాల్లోను మార్పులు చేస్తారా అంటే సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేసి పార్టీ నాయకత్వానికి నాయకులకు కూడా కీలక సందేశం ఇచ్చే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లా.. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తను మార్పు చేశారు. దీనికి ప్రధాన కారణం ఆయన పార్టీలో ఉండకపోవడం, పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించకపోవడమే అన్నది విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇదే తరహా పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లోనూ ఉందన్నది వాస్తవం. అయితే అన్నిచోట్ల నాయకులను మార్చే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఐదు నుంచి పది స్థానాల్లో సమన్వయకర్తలను మార్పు చేయడం ద్వారా పార్టీ నాయకులను కాపాడుకోవడంతో పాటు పార్టీని సరైన దిశగా నడిపించాలన్నది జగన్ వ్యూహంగా ఉంది.
దీనికి సంబంధించి భారీ కసరత్తే చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల ఆఖరుకు దీనిపై స్పష్టత వస్తుందని కూడా అంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలామంది మాజీ మంత్రులు నాయకులు కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేకపోవడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా పార్టీ నాయకులు మారతారా లేక వారు అలానే కొనసాగుతారా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates