క‌విత అరెస్టు చేసిన పోలీసులు, అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ క‌విత‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు.. ఉన్న ప‌లువురు మ‌ద్ద‌తు దారులు, జాగృతి సంస్థ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో హైద‌రాబాద్‌లో కొంత ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. అయితే.. త‌న‌ను అక్ర‌మంగా అన్యాయంగా అరెస్టు చేస్తున్నార‌ని.. కార్మికుల ప‌క్షాన పోరాటం చేస్తుంటే.. ప్ర‌భుత్వం త‌న గొంతు నొక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని క‌విత ఆరోపించారు. అయినా.. త‌ను ప్ర‌జ‌ల ప‌క్షానే నిల‌బ‌డ‌తాన‌ని ఆమె తెలిపారు.

ఏం జ‌రిగింది?

జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న క‌విత‌.. తాజాగా నాంప‌ల్లిలోని సింగ‌రేణి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆమె సింగ‌రేణిలోని డిపెండెంట్ ఉద్యోగుల‌ను తొల‌గించడాన్ని ప్ర‌శ్నించారు. తిరిగి వారంద‌రినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాల‌ని కోరారు. కాగా.. ఖ‌మ్మంలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో క‌విత‌ను కొంద‌రు ఉద్యోగులు క‌లిసి.. త‌మ‌ను విధుల నుంచి తొల‌గించార‌ని.. త‌మ‌కు తిరిగి ఉద్యోగాలు ఇప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో ఆ మ‌రుస‌టి రోజే క‌విత‌.. హైద‌రాబాద్‌లోని సింగ‌రేణి భ‌వ‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ ముట్టడికి క‌విత ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన‌.. పోలీసులు ముందుగానే అక్క‌డ మోహ‌రించారు. చాలా సేపు ధ‌ర్నా చేసిన త‌ర్వాత‌.. సింగ‌రేణి కార్యాల‌యంలోని దూసుకుపోయేందుకు క‌విత ప్ర‌య‌త్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు.. కవితతో పాటు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు సారయ్య సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం నాంప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

కాగా.. క‌విత ఈ సంద‌ర్భంగా స‌ర్కారుపై తీవ్రవిమ‌ర్శ‌లు చేశారు. చిన్న‌పాటి ఉద్యోగులైన సింగ‌రేణి ఉద్యోగుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించ‌లేక పోవ‌డం దౌర్భాగ్య‌మ‌ని అన్నారు. ఇది అస‌మ‌ర్థ ప్ర‌భుత్వ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. కార్మికుల కోసం మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికుల హ‌క్కుల కోసం.. ఉద్యోగాల ప‌రిర‌క్ష‌ణ కోసం తాము నిరంత‌రం పోరాటం చేస్తామ‌ని క‌విత చెప్పారు. కాగా.. దీనిపై కాంగ్రెస్ నేత‌లు ఎదురు దాడి చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలోనే ఇవ‌న్నీ జ‌రిగాయ‌ని.. అప్ప‌ట్లో క‌విత ఎక్కడున్నార‌ని ప‌లువురు ప్ర‌శ్నించారు.