వైసీపీ అధినేత జగన్ పరివారంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయా? పార్టీ భవిష్యత్తుపై ఆశలు ఉడికిపోతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ అధినేత బయటకు రాకపోవడం.. పార్టీని బలమైన దిశగా నడిపించక పోవడం వంటివి నేతల మధ్య చర్చకు వచ్చాయి. ఇక, పార్టీ పరంగాకూడా సరైన అడుగులు వేయలేక పోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో గతంలో మాదిరిగా జగన్ కు ఆదరణ ఉండడం లేదన్న వాదన కూడా ఉంది. గతంలో జగన్ ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ నుంచి వచ్చినా.. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చేవారు.
కానీ, రాను రాను వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇటీవల బెంగళూరుకు వెళ్లిన జగన్‌కు వీడ్కోలు పలికేందుకు పట్టుమని 50 మంది కూడా విమానాశ్రయానికి రాకపోవడం గమనార్హం. ఇదేసమయంలో ఆయన బెంగళూరు నుంచి తిరిగి విజయవాడకు చేరుకున్నా.. అదే పరిస్థితి కనిపించింది. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి జగన్ విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు వస్తారని పోలీసులు భావించారు. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు.
విమానాశ్రయం చుట్టుపక్కల నిషేధాజ్ఞలు విధించారు. అదేవిధంగా విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయవాడ, గన్నవరం సహా పలు ప్రాంతాల నుంచి పోలీసులను కూడా మోహరించారు. కానీ.. చిత్రం ఏంటంటే.. జగన్ బయటకు వచ్చినప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా.. మరోనలుగురు మాత్రమే ఆయనకు స్వాగతం పలకడం కనిపించింది. ఇక, వచ్చినవారికంటే కూడా.. పోలీసులే ఎక్కువ సంఖ్యలో దర్శనమిచ్చారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు కూడా కనిపించకపోవడం విశేషం.
ఈ పరిణామాలను గమనిస్తే.. గతంలో జగన్ వచ్చారంటే.. భారీ సంఖ్యలో తండోపతండాలుగా కార్యకర్తలు, నాయకులు పోగయ్యే వారు. ఆయనకు స్వాగతం పలికేందుకు.. పోటీ పడేవారు. పూల మాలలు, గజ మాలలతో హడావుడి చేసేవారు. కానీ, నాటి ఆదరణ, నాటి తీవ్రత ఇప్పుడు కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏవైనా కానీ.. జగన్ ప్రాభవం మాత్రం తగ్గుతోందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. పార్టీ పరంగా ఎలా ఉన్నా.. అధినేత విషయంలోనూ నాయకులు నిరాశ, నిస్పృహలకు లోనైతే.. అది మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates