ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మైదుకూరు శాసన సభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్..(ఈయన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు)ను కొన్నాళ్ల కిందట సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్టు చేసినవిషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన తీవ్రస్థాయిలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఏకంగా 1.7 కోట్ల రూపాయల సొత్తును సైబర్ నేరస్తులు దోచుకున్నారు. అయితే.. దీనిపై సైబర్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీనిపై కూపీలాగిన పోలీసులు తాజాగా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
వీరిలో ప్రైవేటు ఆర్థిక సంస్థ ఐడీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సైబర్ నేరస్థులతో చేతులు కలిపిన మేనేజర్ డబ్బు ఆశ కోసం.. ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పారు. ఢిల్లీలోని ఐడీఎఫ్‌సీ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి .. బ్యాంకు ఆధారాలతో పుట్టా సుధాకర్‌ను మోసగించినట్టు వివరించారు. అయితే.. ఏ బ్యాంకు నుంచి సొమ్ములను తరలించారు? వాటిని ఎక్కడికి మళ్లించారు? అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. అంతేకాదు.. ఇప్పటి వరకు జరిగిన సైబర్ నేరాల్లో ఈయన పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఈయనతోపాటు మరో ఏడుగురు నిందితులను కూడా అరెస్టు చేసినట్టు విజయవాడలోని సైబర్ పోలీసులు చెప్పారు.
ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని డిజిటల్ అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. ఎవరూ ఇలాంటి విషయాల్లో భయానికి గురి కావాల్సిన అవసరం లేదని… విషయాన్నిపోలీసులకు చెబితే చాలని తెలిపారు. కానీ, భయాందోళనలతో డిజిటల్ అరెస్టును సీరియస్‌గా తీసుకుంటున్నారని.. ఇదే సైబర్ నేరస్తులకు వరంగా మారుతోందని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన అనేక డిజిటల్ అరెస్టుల్లో 55 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని.. ఎక్కువగా 60-75 ఏళ్లున్న వారు ఉన్నారని చెప్పారు. కాగా… ఇదే విషయాన్ని తాజాగా నటుడు అక్కినేని నాగార్జున కూడా చెప్పారు. తన కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్టు అయ్యారని.. అన్నారు. అయితే,ఆయన వివరాలు చెప్పలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates