తమిళనాట మరో సరికొత్త పార్టీ ప్రాదుర్భవించేందుకు రంగం సిద్ధమైంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 31 న కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. గడిచిన మూడేళ్లుగా ఆయన ఊరిస్తూ వచ్చిన రాజకీయ తెరంగేట్రం విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు. బలమైన మద్దతు దారులు, అభిమాన గణం.. ఎప్పటి నుంచో రజనీని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ. వచ్చిన రజనీ.. దీనిపై ఇప్పుడు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే పార్టీ పేరును ఖరారు చేస్తానని.. విధి విధానాలు ప్రకటిస్తానని ఆయన వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడున్న రాజకీయాలకు.. ఇప్పుడున్న ప్రజానాడికి, ఇతర పార్టీలకు.. రజనీ మనస్తత్వానికి పొసిగేనా? ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోవడం సాధ్యమేనా? అనేది మాత్రం మిలియన్ డాలర్‌ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. రజనీ ఇప్పటికే చెప్పినట్టు.. తాను నిజాయితీ రాజకీయాలు, నీతి వంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తానన్న మాటలు.. నేటి రాజకీయాల్లో నేత బీర చందంగానే ఉన్నాయి. పైగా తమిళనాడు రాజకీయాలు.. అక్కడి ప్రజల మానసిక పరిస్థితులు, అక్కడి నేతలు అనుసరిస్తున్న తీరుకు.. రజనీ వ్యూహాలకు ఏ మాత్రం సరిపోయేలా కనిపించడం లేదు.
ఈ దేశంలో ప్రజలకు ఉచితాలు పరిచయం చేసిన తొలిరాష్ట్రం తమిళనాడు. పైగా ఎన్నికలు వస్తే.. చాలు.. అన్ని ఉచితమేననే వాగ్దానాలు.. నాయకుల నోటి వెంట అలవోకగా వచ్చేస్తాయి. అయితే.. ఇలాంటి ఉచితాలతో ప్రజలను సోమరులు చేస్తున్నారని.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ట్వీట్ల సమరం చేసిన రజనీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ఉచితాలు.. ఆయనకు ప్రతిబంధకంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని ప్రకటించిన.. తేలికగా.. వాటిని సుసాధ్యం చేయడమూ ఈ దేశంలో సాధ్యం కాదని.. అనే పార్టీలురుజువు చేశాయి.
ముఖ్యంగా ప్రజాభిమానం వేరు.. ఓటు బ్యాంకు రాజకీయాలు వేరు. ఏపీ విషయాన్ని తీసుకుంటే.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ నిర్వహించినా.. యువత భారీ ఎత్తున వరదలై ఉప్పొంగారు. సీఎం పవన్ అంటూ నినాదాలు కూడా చేశారు. వీటిని చూసిన వారు.. ముఖ్యంగా జనసేన నాయకులు కూడా పార్టీ అధికారంలోకి వచ్చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ, ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇక, దీనికి ముందు ఎంతో ప్రజాదరణ ఉన్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలానేస్పందన వచ్చింది. ఆయన విషయంలోనూ ఓటు బ్యాంకు రాజకీయం ఎదురు తిరిగింది.
ఈ పరిణామాలను గమనిస్తే.. తమిళనాడులోనూ రజనీకి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలను ఓట్లను అమ్ముకునేలా ప్రోత్సహించిన పార్టీలను, దానికి అలవాటు పడిన ఓ వర్గం ప్రజలను నీతి-నిజాయితీ పేరిట తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం రజనీకి సాధ్యమయ్యే విషయమేనా? ఇక, లెక్కకు మిక్కిలిగా ఉన్న పార్టీల నుంచి తన పార్టీని గెలుపు గుర్రం ఎక్కించడం, అధికారం దఖలు పరుచుకోవడం కూడా రజనీకి ఇప్పుడున్న వ్యవస్థలో సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను విశ్లేషిస్తే.. రజనీ కూడా మరో పవన్‌గా మిగిలిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో.. తమిళ ఓటరుఎలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates