వైసిపి పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికీ పలు కేసుల్లో చిక్కుకుని అనేకమంది నాయకులు జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరికొన్ని కేసులు పార్టీ కీలక నాయకులకు చుట్టుకుంటున్నాయి. వీటిలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కేసు. ఈ వ్యవహారం ఇప్పుడు అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇటీవల ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. అదేవిధంగా స్థానిక కోర్టుకు కూడా నివేదికలోని అంశాలను వెల్లడించారు. తద్వారా అసలు ఏం జరిగింది.. అనే విషయాలు బయటకు వచ్చాయి. రాజకీయంగా వచ్చిన విమర్శల ప్రకారం శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు లేవని కేవలం ఇవి రాజకీయ విమర్శలేనని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో అసలు దాన్ని పాల నుంచి గాని వెన్న నుంచి గాని తయారు చేయలేదని పేర్కొనడం మరింత వివాదంగా మారింది.
అసలు నెయ్యిని పామాయిల్ అదేవిధంగా ప్రత్యేక రసాయనాలను ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించి తయారు చేశారని సిబిఐ అధికారులు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. అయితే ఇలా నెయ్యి కల్తీ జరిగిన విషయం తెలిసి కూడా అనుమతించారు అనేది ఇప్పుడు వై వి సుబ్బారెడ్డి కి చుట్టుమట్టిన ప్రధాన విషయం. ఇదే విషయాన్ని సిబిఐ కూడా తన నివేదికలో పేర్కొంది. సుబ్బారెడ్డి కి విషయం తెలుసని అయినప్పటికీ ఆయన అనుమతించారని సిబిఐ అధికారులు పేర్కొన్నారు.
దీనికి మద్దతుగా వైవి సుబ్బారెడ్డి అనుచరుడు చిన్న అప్పన్న అరెస్టు కావడం, ఆయన బ్యాంకు ఖాతాలను పరిశీలించినప్పుడు నాలుగు కోట్ల పైచిలుకు మొత్తం అందులో ఉండడం వంటివి ఆధారాలుగా వారు సేకరించారు. ఈ మొత్తం పరిణామంతో వైవి సుబ్బారెడ్డి అరెస్టు ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈనెల 21న సిట్ విచారణకు కూడా వై వి సుబ్బారెడ్డి రానున్నారు. అయితే సుబ్బారెడ్డి గనక అరెస్టు అయితే వైసిపి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు టెన్షన్ టెన్షన్ గా మారింది.
ఆ పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేకమంది అరెస్టు కావడం, జైల్లో ఉండడం ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం మరింత తీవ్రంగా ముసురుకున్న నేపథ్యంలో దీనిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి అరెస్టు అయితే.. ఏమీ కాదులే అనుకునే పరిస్థితి లేదు. ఇది కోట్ల మంది హిందూ ఓటర్లు, వారి మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో వైవీ కేసుపై వైసీపీ తర్జన భర్జన పడుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates