అభ్యర్ధి ప్రచారం కన్నా వెనక ప్రచారమే కొంప ముంచేట్లుంది

తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక ఖాయమైపోయిన తర్వాత తమ సత్తా ఏమిటో చాటు కోవాలని అన్నీ పార్టీలు సహజంగానే ఉత్సాహం చూపుతున్నాయి. ఇందులో బాగంగానే ముందుగా బీజేపీ పోటీకి రెడీ అంటు ప్రకటించేసింది. తర్వాత చంద్రబాబునాయుడు ఏకంగా అభ్యర్ధినే ప్రకటించేశారు. ఇదే సమయంలో ఆనవాయితికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి బల్లి కుటుంబీకులను కాకుండా కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పై మూడు పార్టీలకు సంబంధించి బీజేపీ, అధికార వైసీపీల సంగతిని పక్కన పెట్టేస్తే తెలుగుదేశంపార్టీ విషయంలో జరుగుతున్న ప్రచారమే అభ్యర్ధి కొంప ముంచేట్లుంటుందని టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ ఆ ప్రచారం ఏమిటంటే టీడీపీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని పోటీలోకి దింపుతున్నా చివరకు బీజేపీ అభ్యర్ధిగా దిగబోయే వాళ్ళకే టీడీపీ మద్దతుంటుందనే ప్రచారం ఎక్కువైపోతోంది.

ఇటువంటి ప్రచారం జరగటానికి ఉదాహరణలు కూడా చూపుతున్నారు జనాలు. గతంలో జరిగిన కడప లోక్ సభ ఉపఎన్నికలో జగన్ను ఓడించటానికి టీడీపీ అభ్యర్ధి ఉన్నా కాంగ్రెస్ అభ్యర్ధికి లోపాయికారీగా సహకరించారట చంద్రబాబునాయుడు. అలాగే తర్వాత మరికొన్ని అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా పేరుకు పార్టీ తరపున పోటీ చేయించటం, కాంగ్రెస్ అభ్యర్ధులకు సహకరించిన చరిత్ర చంద్రబాబుదంటూ తిరుపతిలో ప్రచారం పెరిగిపోతోంది. ఈ మొత్తం మీద జరిగిందేమంటే టీడీపీకి డిపాజిట్లు రాకపోయినా పర్వాలేదు వైసీపీ అభ్యర్ధులను ఓడించాలనే ధ్యేయంతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సహకరించారని చెప్పుకుంటున్నారు.

అయితే గతంలో లాగ కాంగ్రెస్ కు సహకరించే అవకాశం లేదు కాబట్టి దాని స్ధానంలో బీజేపీకి సహకారం అందిస్తారంటూ ప్రచారం పెరిగిపోతోంది. నిజంగా ఈ ప్రచారానికి ఫులిస్టాప్ పెట్టకపోతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు.

టీడీపీ అభ్యర్ధి పనబాక గెలుపుకు జరగాల్సిన ప్రచారం కాస్త ఆమెకు పోటీపై ఆసక్తి లేదని, టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉన్నా బీజేపీ గెలుపుకే టీడీపీ సహకరిస్తుందని జరుగుతున్న ప్రచారం చాలా డ్యామేజింగా ఉంది. ఇటువంటి ప్రచారం తెలుగుదేశంపార్టీకి ఏ రకంగా చూసినా మంచిది కాదు. కాబట్టి చంద్రబాబు వెంటనే మేలుకుని అడ్డుకట్ట వేయకపోతే పార్టీ కొంప ముణిగిపోవటం ఖాయమే. మరి చంద్రబాబు ఎంత తొందరగా డ్యామేజి కంట్రోలుకు దిగుతారో చూడాల్సిందే.