ప‌వ‌న్ పాయింట్‌: పెద్దిరెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్స‌య్యారు?

త‌ప్పులు చేయ‌డం కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. అయితే.. ఆ త‌ప్పుల‌ను కూడా చేతికి మ‌ట్టి అంట‌కుండా చేసేవారు కొంద‌రు ఉన్నారు. కానీ.. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన త‌ప్పులో కీల‌కమైన లాజిక్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట పెట్టారు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ లాజిక్ ఎలా మిస్స‌య్యార‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది.

ఏం జ‌రిగింది..?

పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దిరెడ్డికి తిరుగులేదు. వ‌రుస విజ‌యాలు.. ఇత‌ర పార్టీల హ‌వాను నియంత్రించ‌డంతో ఆయ‌న ఇక్క‌డ చెల‌రేగిన విష‌యంతెలిసిందే. వైసీపీ హ‌యాంలో అట‌వీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు అట‌వీ భూముల‌ను ఆయ‌న ఆక్ర‌మించుకుని.. వారి కుటుంబ స‌భ్యుల పేరుతో ఆయ‌న రిజిస్ట‌ర్ చేయించుకున్నార‌ని కూడా ప్ర‌భుత్వం గుర్తించింది. ఇలా.. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మంగ‌ళం అట‌వీ భూముల్లో ఆక్ర‌మించుకున్న స్థ‌లాల‌పై ప‌వ‌న్ దృష్టి పెట్టారు.

ఏకంగా 104 ఎక‌రాల భూముల‌ను(పూర్తిగా అట‌వీ భూములు) పెద్దిరెడ్డి త‌న కుటుంబ స‌భ్యుల పేరుతో రిజిస్ట‌ర్ చేయించారు. అయితే.. వీటిని ఆయ‌న త‌న వార‌స‌త్వ భూములుగా వ‌చ్చాయ‌ని రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక్క‌డే ఆయ‌న లాజిక్ మిస్స‌య్యార‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. పొలాలు.. స్థ‌లాల విష‌యంలో వార‌స‌త్వంగా భూములు సంక్ర‌మించ‌డం ప‌రిపాటే. కానీ, అట‌వీ ప్రాంతంలో వార‌స‌త్వం ఏంట‌న్న‌ది ప‌వ‌న్ ప్రశ్న‌.

అంతేకాదు.. అట‌వీ ప్రాంతంలో అది కూడా మ‌ధ్య‌లో త‌మ‌కు వార‌స‌త్వంగా భూములు వ‌చ్చాయ‌ని పెద్ది రెడ్డి పేర్కొన‌డం వివాదానికి దారి తీసింది. ఈ విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆయా వివ‌రాల‌ను సేక‌రించి.. వారసులు ఎవ‌రు? ఎవ‌రికి ఎలా భూములు ద‌క్కాయి.? దీనిలో వాస్త‌వం ఎంత‌? అనే విష‌యాల‌పై నివేదిక ఇవ్వాల‌ని అట‌వీ శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. ఈ పరిణామం పెద్దిరెడ్డి శిబిరంలో క‌ల‌క‌లం రేపింది. మ‌రిదీనిపై అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారో చూడాలి. గ‌తంలో కూడా.. స‌ర్వే చేసిన‌ప్పుడు.. పెద్దిరెడ్డి భూముల‌కు అధికారులు నివేదిక ఇచ్చిన విష‌యం తెలిసిందే.