సీఎం చంద్రబాబు తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి భారీ హామీ ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో తొలిరోజు శుక్రవారం ఆయన పెట్టుబడి దారులను ఉద్దేశించి మాట్లాడారు. 72 దేశాల నుంచి సుమారు 2500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే పెట్టుబడి దారులకు ఏపీ అందిస్తున్న రాయితీలను కూడా పూసగుచ్చినట్టు వివరించారు. దీనిలో ప్రధానంగా భూములు, నీరు, విద్యుత్ సహా.. స్థానిక పన్నుల నుంచి కొన్నేళ్లపాటు మినహాయింపు కూడా ఇస్తామన్నారు. అదేసమయంలో పెట్టుబడులకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందన్నారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని.. పెట్టుబడితో వస్తే.. ఉత్పత్తి ప్రారంభించే వరకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చంద్రబాబు తెలిపారు.
ఈ క్రమంలోనే పెట్టుబడి దారులకు `ఎస్క్రో` ఖాతాను ఏర్పాటు చేస్తామన్నారు. ఇది నిజానికి ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వమూ ఆఫర్ చేయలేదు. ఎస్క్రో ఖాతా అనేది అత్యంత కీలక అంశం. పైగా.. ఇది ఎప్పటికప్పుడు ఫ్రీజ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. ఇలాంటి వినూత్న ఆఫర్ చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. నిజానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వివిధ ప్రాజెక్టుల నిధులను ఎస్క్రో ఖాతాకు జమ చేస్తుంది. అంటే.. అక్కడ నిధులు అత్యంత భద్రంగా ఉంటాయి. ఇతర ప్రాజెక్టులకు కూడా మళ్లించేందుకు వీల్లేదు.
అలానే ఇప్పుడు చంద్రబాబు పెట్టుబడి దారులకు ఎస్క్రో ఖాతాలు ఇస్తామని ప్రకటించారు. దీంతో అసలు ఎస్క్రో ఖాతా అంటే ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటన్నది ఆసక్తిగా మారింది. `ఎస్క్రో` ఖాతా అనేది తటస్థ మూడవ పక్షం నిర్వహించే సురక్షిత ఖాతా. ఇది లావాదేవీలోని రెండు పక్షాలు వారి అంగీకరించిన ఒప్పంద షరతులను నెరవేర్చే వరకు నిధులు లేదా ఆస్తులను కలిగి ఉంటుంది.
అంతేకాదు.. పెట్టుబడిదారు పేర్కొన్న విధంగా వస్తువులు, సేవలు లేదా ఆస్తిని స్వీకరించే వరకు రెండో పక్షానికి డబ్బు విడుదల చేయడానికి అంగీకరించదు. అంతేకాదు.. పెట్టుబడిదారు పెట్టే నిధులు తాత్కాలికంగా సురక్షితంగా ఉంటాయి. ఈ భద్రత ఇరు పక్షాలకు నమ్మకాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఎస్క్రో ఖాతా అనేది నిర్దేశిత నిబంధనల మేరకు అమలు చేస్తారు. ఇప్పుడు ఇంత సురక్షిత ఖాతానే పెట్టుబడి దారులకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates