కేకే సర్వే ఫెయిల్.. ఏం జరిగింది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లుగా అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన 11వ తేదీ సాయంత్రం అనేక సర్వేలు వచ్చాయి. వీటిలో నాగన్న సర్వే నుంచి స్మార్ట్ పోల్స్, పబ్లిక్ పల్స్, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.

అయితే ఒకే ఒక్క కేకే సర్వే మాత్రం ఈ విషయంలో బీఆర్ ఎస్‌కు పట్ట కట్టింది. వాస్తవానికి 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, వైఎస్ఆర్‌సీపీ కేవలం 10 స్థానాలకు పరిమితం అవుతుందని కేకే సర్వే ముందే చెప్పింది. అచ్చంగా అప్పట్లో అలాగే జరుగడంతో కేకే సర్వేకు మంచి ప్రాధాన్యం పెరిగింది.

ఆ తర్వాత జరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కేకే సర్వే ఫలితాలు నిజమయ్యాయి. దీంతో తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేకే సర్వేకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. కేకే సర్వే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇందులో బీఆర్ ఎస్ 4 శాతం ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని తుది ఫలితాల్లో పేర్కొంది. మొదట్లో మాత్రం బీఆర్ ఎస్‌కు 14 నుంచి 16 శాతం ఓట్ల తేడా వస్తుందని చర్చ సాగింది.

కానీ తాజా ఫలితాల్లో బీఆర్ ఎస్ భారీగా వెనుకబడింది. ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో పాటు ప్రతి రౌండ్‌లోనూ వెనుకపడింది. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ కూడా తమ అంతర్గత సర్వేలపై నమ్మకం పెట్టుకుంది. సెంటిమెంట్ గోరింటాకు మాదిరిగా పండుతుందని భావించింది. దీంతో కొంత జోష్ వచ్చినా ఎక్కడా తడబాటు చూపకుండా ముందుకు సాగింది.

కానీ ప్రజల నాడి అనూహ్యంగా యు టర్న్ తీసుకుని బీఆర్ ఎస్‌కు భారీ ఇబ్బందిని తీసుకువచ్చింది. మొత్తం చూస్తే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే నిలిచాయి.