పీకే దెబ్బ.. కాంగ్రెస్ కూటమి బెంబేలు: సర్వేలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని, మార్పు దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ప్రకటించిన రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ (జెఎస్పీ) అధినేత ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే పెద్దగా సత్తా చూపలేకపోయారని సర్వేలు చెబుతున్నాయి.

రెండు దశల పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు బీహార్‌లో ఎవరికీ ప్రజలు పట్టం కట్టారన్న విషయాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా 148 స్థానాల్లో నేరుగా అభ్యర్థులను దింపి, ‘మార్పుకోసం ఓటు’ నినాదాన్ని అందుకున్నప్పటికీ, పీకే విషయంలో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని సర్వేలు తెలిపాయి.

తాజా సర్వేల్లో పలు సంస్థలు జన సురాజ్ పార్టీ కేవలం 2-3 స్థానాల్లో గెలిస్తే అదే పెద్ద విజయం అవుతుందని స్పష్టం చేశాయి. మరికొన్ని సంస్థలు పీకేను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నాయి. దీంతో 1-2 స్థానాల్లో విజయం దక్కించుకున్నా అది పీకేకు గొప్ప ఫలితమేనని అభిప్రాయపడ్డాయి.

అయితే పీకే సహా ఇతర చిన్నా చితకా పార్టీలు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ పరోక్ష పరాజయానికి దారి తీసే అవకాశం కల్పించాయని సర్వేలు తెలిపాయి. ఓట్ల చీలిక ద్వారా ఎన్డీయే బలపడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంతో ఎన్డీయే మరోసారి విజయం సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషించాయి.

ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన పూర్వాంచల్, ఉత్తరాంచల్ ప్రాంతాల్లో (మొత్తం 13 జిల్లాలు) పీకే సహా చిన్న పార్టీలు ఓట్లను చీల్చాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఆది నుంచి మహాఘట్‌బంధన్ ఆయా జిల్లాలపై ఆశలు పెట్టుకున్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి లాభం దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఉన్న పూర్వాంచల్‌లో కాంగ్రెస్ కూటమికి గట్టి దెబ్బ తగిలినట్టు పేర్కొంది. ఇక ఎన్డీయే వైపే మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపినట్టు సర్వేలు తెలిపాయి. జీఎస్టీ తగ్గింపు సహా ప్రధాని మోడీ ఇమేజ్ బాగా పనిచేశాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఏదేమైనా దేశంలో అనేక పార్టీలకు ఊతంగా మారిన పీకే తన సొంత రాష్ట్రంలోనే సత్తా చూపలేకపోతున్నారన్న వాదన మాత్రం బలంగా వినిపించడం గమనార్హం.