మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలు, తెలుగు దేశం కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సమస్యలు మీవి కావు.. నావి.. అని వారికి భరోసా కల్పించారు.
ఆయా సమస్యలపై ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి బాధితుల నుంచి కూడా వివరాలు సేకరించారు. ఆర్థేకతర అంశాలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్.. బాధితుల యోగ క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు.
కొందరిని.. ప్రభుత్వ పథకాలు, పింఛన్ల పంపిణీ గురించి ఆరా తీశారు. ఎవరైనా లబ్ధి దారులు అయి ఉండి .. పథకాలు లభించనివారు.. వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని.. ఈ మేరకు స్థానికంగా ఉన్న వారికి కూడా సూచించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా పలువురు సీఎంఆర్ ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారికి సంబంధించిన పత్రాల పై స్వయంగా సంతకాలుచేసి పంపించారు.
కాగా.. మంత్రినారా లోకేష్.. నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్రజలు పోటెత్తడం గమనార్హం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. కానీ.. కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో నారా లోకేష్ కోసం ప్రజలు క్యూ కట్టడం గమనార్హం. తాజాగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 3000 మంది ప్రజలు హాజరయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates











