ఎర్రచందనం.. ఏపీలో మాత్రమే.. అది కూడా తిరుపతి జిల్లాలోని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్రమార్కులు తెగనరికి పెద్ద ఎత్తున రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయకులైన ఏపీ, తెలంగాణ పౌరులను, కూలీలను కూడా వినియోగించుకుంటున్నారు. ఇక, అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం.. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి పట్టుకున్న దుంగలు కూడా టన్నుల కొద్దీ తిరుపతి గోడౌన్లలో పేరుకుపోయాయి. వీటిని ఏం చేయాలన్న విషయం కూడా సర్కారుకు పెద్ద సమస్యగా మారింది.
కరోనాకు ముందు చెనా, జపాన్ సహా పలు దేశాలకు చెందిన వ్యాపారులు వచ్చి వీటిని కొనుగోలు చేసేవారు. అయితే.. కరోనా అనంతరం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం కొనుగోలు, విక్రయాలు మందగించాయి. దీంతో ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నించినా.. కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా వేలం ప్రక్రియను ప్రారంభించి వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలతో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ వేలం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు ఎర్రచందనం వృక్షాలకు భద్రత కూడా కరువైంది. ఇటీవల తిరుపతి జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. అక్రమ రవాణాదారులకు గట్టివార్నింగ్ ఇచ్చారు.
ఇదేసమయంలో ఆయన తిరుపతిలోని గోడౌన్లను కూడా పరిశీలించారు. భారీ ఎత్తున పేరుకున్న దుంగలను పరిశీలించి వాటి వివరాలను తెలుసుకున్నారు.. వాటి విలువ ఎంత ఉంటుందన్న విషయాన్ని కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు వేలానికి సంబంధించిన సమస్యలు, అంతర్జాతీయ తగ్గిన ధరలు వంటివాటిని వివరించారు. కట్ చేస్తే.. తాజాగా ఈవిషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు.
అంతర్జాతీయంగా వేలం వేసే బదులు.. ప్రస్తుతం పట్టుకున్న, గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం.. దుంగలతో రాష్ట్రంలోని కళాకారులతో బొమ్మలు తయారు చేయించాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. వాటిని దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా.. విక్రయించడం ద్వారా సాధారణ ముడి దుంగలను విక్రయిస్తే.. వచ్చే సొమ్ముల కన్నా రెండింతలు సంపాయించుకునే అవకాశం ఉంటుందన్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని కళాకారులకు కూడా పనికల్పించినట్టు అవుతుందని సూచించారు. ఈ సూచనలకు సీఎం చంద్రబాబు కితాబునిచ్చారు. బాగుందన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుందామని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates