రాజకీయాల్లో ఉన్నవారికి పట్టుదల ఉంటుంది. ఇక, అధికారంలో ఉంటే అది మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో తాము అనుకున్నది సాధించాలని పట్టుదలతో ముందుకు వెళ్తారు. గతంలో వైసీపీ హయాంలో జగన్ మూడు రాజధానుల కోసం పట్టుబట్టారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా ఆయన మొండిగా వ్యవహరించారు. ఫలితం ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం కావడం వెనుక ఈ రీజన్ బలంగా పనిచేసిందని రాజకీయ పండితులు చెబుతారు.
కానీ, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇలాంటి విసయాల్లో విజ్ఞత ప్రదర్శిస్తున్నారు. తాను పట్టిన పట్టుకే ఆయన ప్రాధాన్యం ఇచ్చినా సమయం, సందర్భం చూసుకుని పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా తాను అనుకున్నది సాధించే క్రమంలో ఒకింత వెనుకడుగు వేసినట్టు కనిపిస్తున్నా మొత్తానికి లక్ష్యం అయితే చేరేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి 2014 తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల్లో చంద్రబాబు పట్టు విడుపుల ధోరణినే ప్రదర్శించారు.
తాజాగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ చంద్రబాబు పట్టు విడుపులతోనే ముందుకు సాగాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా బనకచర్ల గ్రామంలో నిర్మించ తలపెట్టిన భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సీమ తలరాతను మారుస్తామని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. దీనిని రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా కూడా ప్రకటించారు. కానీ, ఆయన సంకల్పం మంచిదే అయినా పొరుగు రాష్ట్రాల నుంచి వివాదాలు వచ్చాయి. తమిళనాడు, కర్ణాటకలు గోదావరి జలాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
వాస్తవానికి చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కేంద్రంలోనూ ఆయనకు మంచి పలుకుబడి ఉంది. దీంతో ఆయన పట్టుబట్టి సాధించే ప్రయత్నం చేయొచ్చు. కోట్ల రూపాయలు వెచ్చించి న్యాయపోరాటం అంటూ సాగదీత దోరణిని కూడా అవలంభించవచ్చు. కానీ, బాబు అలా చేయలేదు. పది మందీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు సదరు ప్రాజెక్టును మార్చుకుంటే బెటర్ అని ఆలోచించారు.
ఈ క్రమంలో ఎవరికీ అభ్యంతరం లేని విధంగా బనకచర్ల ప్రాజెక్టును సమూలంగా మార్పు చేస్తూ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సో, ఇదీ బాబు విజ్ఞత అంటున్నారు పరిశీలకులు. దీనివల్ల ఘర్షణలు రాకపోగా బాబు అనుకున్న లక్ష్యం స్వల్ప తేడాతో అయినా నెరవేరనుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates