ఎన్టీఆర్ ట్ర‌స్టులో మ‌రో సేవ‌.. ప్రారంభించిన భువ‌న‌మ్మ‌

ఎన్టీఆర్ ట్ర‌స్టు పేరుతో స‌మాజంలోని మ‌హిళ‌లు, అట్ట‌డుగు వ‌ర్గాల‌కు సేవ‌లందిస్తున్న సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. ఎన్టీఆర్ త‌న‌య నారా భువ‌నేశ్వ‌రి.. తాజాగా మ‌రోసేవ‌కు శ్రీకారం చుట్టారు. ఈసేవ ద్వారా మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా ఆమె ఊత‌మివ్వ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఏపీ, తెలంగాణ‌ల‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్టుకేంద్రాల్లో మ‌హిళ‌ల‌కు చేతి వృత్తులు నేర్పించారు. త‌ద్వారా వారిని సొంత కాళ్ల‌పైనిల‌బ‌డేలా చేస్తున్నారు.

ఇలా ఉపాధి పొందుతున్న మ‌హిళ‌ల‌తో `స్త్రీ శ‌క్తి మ‌హిళా సంఘం` ఏర్పాటు చేశారు. దీనిలో 600 మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ద్వారా వారు రూపొందించిన వ‌స్తువుల‌ను మార్కెటింగ్ చేసే బాధ్య‌త‌నుకూడా ఎన్టీఆర్ ట్ర‌స్టే తీసుకుంది. దీనిలో భాగంగా హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ, క‌ర్నూలు, వ‌రంగ‌ల్ స‌హా ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో `స్త్రీ శ‌క్తి హ్యాండీ క్రాఫ్ట్స్‌ స్టోర్స్‌`ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ స్టోర్స్‌లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌లోని మ‌హిళ‌లు రూపొందించిన వ‌స్తువుల‌ను విక్ర‌యంచ‌నున్నారు.

స్వ‌ల్ప లాభాల‌తో నాణ్య‌మైన మెటీరియ‌ల్‌తో రూపొందించిన ఈ వ‌స్తువులవిక్ర‌యాల‌ను తాజాగా నారా భువ‌నేశ్వ‌రి ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ మెయిన్‌గేట్‌ సమీపంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి హ్యాండీ క్రాఫ్ట్స్‌ స్టోర్‌ను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో సీఎం స‌తీమ‌ణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయ‌డం.. వ‌చ్చిన లాభాల్లో ఖ‌ర్చులు పోగా మిగిలిన సొమ్మును సంఘానికే చెందిన ఖాతాలో వేయ‌నున్నారు. దీని నుంచి స‌భ్యుల‌కు ఖ‌ర్చు చేయ‌నున్నారు. మ‌హిళ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్త్రాలు, వ‌స్తువులు, ఇత‌ర ఆభ‌ర‌ణాలు ఈ స్టోర్స్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భించ‌నున్నాయి.