ఏపీ రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని కొందరు(వైసీపీ) నాశనం చేయాలని చూశారని.. కానీ, ఇక్కడి రైతులు.. ప్రజలు రాజధానిని కాపాడుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని పనులను వేగంగా చేపట్టామన్నారు. దీనికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కూడా అందుతోందని తెలిపారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే రెండేళ్లలోనే దాదాపు సగం పనులు పూర్తవుతాయని చెప్పారు.
ఇటీవల అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని.. ఇక, అమరావతిపై ఎవరూ ఎలాంటి భ్రమలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. అనేక సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభం అవుతుందన్న ఆయన.. దీనికి సంబంధించి కంప్యూటర్ వ్యవస్థ కూడా రెడీ అయిందని తెలిపారు. ఇది రవాణా జరిగి.. అమరావతికి రావడమే మిగిలి ఉందన్నారు. ఇక, అమరావతిని మెగా సిటీగా రూపాంతరం చేస్తున్నట్టు వివరిస్తున్నారు. తద్వారా మరిన్ని ప్రాంతాలు అమరావతి పరిధిలోకి వస్తాయన్నారు.
హైదరాబాద్ స్థాయిలో అమరావతిలో ఈవెంట్లు కూడా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడ కూడా అమరావతిలో భాగమేనన్న ఆయన.. కృష్ణానదిపై రెండు ఐకానిక్ వంతెనల నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. దీంతో పూర్తిస్థాయిలో అమరావతికి-విజయవాడకు మధ్య అనుసంధానం ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌కు -అమరావతికి మధ్య రోడ్డు ఫెసిలిటీ కూడా ఏర్పడుతుందన్నారు. ఇక, ఇప్పటికే అనేక కార్యక్రమాల ద్వారా అమరావతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. పలు సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడమే దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
“కొందరు అమరావతిని నాశనం చేయాలని చూశారు. ఇప్పుడు వారు కుళ్లుకునేలాగా.. అమరావతి అభివృద్ధి చెందుతోంది. అనేక సంస్థలు వస్తున్నాయి. కేంద్రం సహకరిస్తోంది. నిధులకు ఇబ్బంది లేదు. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి రైతులకు త్వరలోనేన్యాయం చేస్తాం. భూములు ఇవ్వాలని మరోసారి కోరుతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే.. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది. అది ఏపీకి మాత్రమే కాకుండా దేశానికే తలమానికంగా మారుతుంది.“ అని సీఎం చంద్రబాబు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates