జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. తాను మాగంటి గోపీ కుమారుడినని, తనను అమెరికా నుంచి ఇక్కడకు రావద్దని కొందరు నేతలు బెదిరించారని ఓ యువకుడు మాట్లాడిన వీడియో సంచలనం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాగుంట గోపీ మరణం వెనుక కేటీఆర్ హస్తముందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారని, ఆ ఆరోపణలు నిజమైతే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి, ఫిర్యాదు లేకుండా ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయం చేయాలని తాను అనుకోవడం లేదని రేవంత్ చెప్పారు. అయితే, తన కుమారుడి మృతికి కేటీఆర్ కారణమని మాగుంట గోపీ తల్లి టీవీలలో మాట్లాడినట్లు తనకు అనిపించిందని రేవంత్ అన్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు విచారణ చేయమని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ జరుపుతారని చెప్పారు.
అంతకుముందు, మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆరే కారణమని, ఆ మాట గోపీనాథ్ తల్లి స్వయంగా చెప్పారని బండి సంజయ్ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడైతే, కేటీఆర్ అంతకంటే పెద్ద మూర్ఖుడని, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం కేటీఆర్‌కు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడెప్పుడు సీఎం గద్దెనెక్కాలా అని కేటీఆర్ చూస్తున్నారని, పదవి కోసం ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates