దాప‌రికం లేదు.. బుజ్జ‌గింపులు లేవు.. క‌డిగేసిన బాబు!

దేశంలో ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌భుత్వాధినేతగా ఉన్న ముఖ్య‌మంత్రి స‌హ‌జంగా స‌ర్కారు చేసే త‌ప్పుల‌ను వెల్ల‌డించేందుకు సంశ‌యిస్తారు. నేరుగా బ‌య‌ట‌కు కూడా చెప్ప‌రు. ఎందుకంటే డ్యామేజీ అవుతుంద‌న్న వాద‌న కావొచ్చు. లేక‌పోతే.. ప్రత్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇస్తున్నామ‌న్న వాద‌న కావొచ్చు. గతంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అలానే చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున జ‌రిగిన త‌ప్పుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించేందుకు సంశ‌యించేవారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో ప‌ల‌చన అయ్యారు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితికి భిన్నంగా సీఎం చంద్ర‌బాబు తాజాగా స‌ర్కారు చేస్తున్న మంచితో పాటు.. త‌ప్పుల‌ను కూడా ప్ర‌స్తావిస్తున్నారు. అంతేకాదు.. ఎవ‌రినీ ఈ విష‌యంలో బుజ్జ‌గించ‌లేదు. అదేస‌మ‌యంలో ఎంత త‌ప్పుల‌నైనా ఆయ‌న దాచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, మంత్రుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో క‌ర్నూలు బ‌స్సు ద‌గ్ధం ఘ‌ట‌న నుంచి అమ‌లాపురం, విశాఖ‌ల్లో చోటు చేసుకున్న అగ్నిప్ర‌మాదాల వ‌ర‌కు.. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఇటీవ‌ల జ‌రిగిన తొక్కిసలాట ను కూడా ప్ర‌స్తావించారు.

“ఒక‌సారి ప్ర‌మాదం జ‌రిగింద‌న‌డం స‌హ‌జ‌మే. కానీ.. మ‌రోసారి కూడా అలాంటి ప్ర‌మాదాలే జ‌రుగుతున్నాయి. వీటిని నిలువ‌రించేందుకు క‌ట్ట‌డి చేసేందుకు ఎందుకు ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని” ప్ర‌శ్నించారు. అంతేకాదు.. జవాబుదారీ త‌నం అంటే.. కేవ‌లం మంత్రులు, ప్ర‌భుత్వానిదే కాద‌ని.. అధికారుల‌ది కూడా అని తేల్చి చెప్పారు. సంఘ‌టన జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త నుంచి అధికారులు త‌ప్పించుకోలేర‌ని శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఘ‌ట‌న విష‌యంలో చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌న్న సీఎం.. ఏ విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని భావిస్తే.. అదే ప్ర‌మాదాల‌కు దారి తీసే రోజు అవుతుంద‌ని హెచ్చ‌రించారు. టెక్నాల‌జీని వినియోగించు కుంటే.. అనేక ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌న్నారు. ప్ర‌తి విష‌యంలోనూ.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. కాగా.. ఇలా.. గ‌తంలో ఎప్పుడూ చ‌ర్చించిన సంద‌ర్భాలు లేవు. చంద్ర‌బాబు అంటే… ఎప్పుడూ.. ఏదో చెబు తార‌న్న వాద‌న నుంచి ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్ప‌డం.. హెచ్చ‌రించడం.. త‌ప్పులు స‌రిచేసుకునేందుకు సిద్ధం కావ‌డం వంటివి గ‌మ‌నార్హం.