కట్టు తప్పుతున్న నాయకులను గాడిలో పెట్టేందుకు.. టీడీపీ మరిన్ని ఆయుధాలు సిద్ధం చేస్తోందా? మరింతగా వారికి గీతలు గీయనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న టీడీపీ.. వాటి వల్ల పార్టీ ఇబ్బందులు పడుతుండడాన్ని గ్రహించింది. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలను.. కట్టుబాటును పట్టించుకోని నాయకుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది.
నిజానికి టీడీపీలో 100 శాతం మంది నాయకులు ఉంటే.. కేవలం 2-3 శాతం మంది నాయకులు మాత్రమే కట్టుతప్పుతున్నారన్నది వాస్తవం. వారిలోనూ కొత్తగా అవకాశం దక్కించుకున్నవారే ఉన్నారు. తొలిసారి గెలిచిన వారు.. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని కట్టడి చేసేందుకు.. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా టీడీపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దీనిలో భాగంగా రెండు రకాలుగా పార్టీని ప్రక్షాళన చేయనున్నారు. 1) పార్టీ సిద్ధంతాలను, పార్టీ ఇప్పటి వరకు ప్రజల్లో ఎలా ఎదిగిందనే విషయంపై త్వరలోనే కొత్త నాయకులకు ఓరియెంటేషన్ క్లాసులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తాజాగా పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు.. ఓ నివేదికలో పేర్కొన్నారు. సహజంగా కొత్తగా ఎన్నికైన నాయకులకు.. అసెంబ్లీ కార్యక్రమాలపై తర్ఫీదు ఇస్తున్నారు. ఇది టీడీపీ నాయకులకే పరిమితం.
అయితే.. ఇప్పుడు పార్టీ పరంగా కూడా.. వారికి తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. 2) భవిష్యత్తు ప్రణాళికలు. వచ్చే 15 ఏళ్లపాటు పార్టీని అధికారంలోకి ఉంచేలా.. కూటమిని బలోపేతం చేసేలా.. వ్యవహరించాలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో దీనిపై అందరికీ.. దిశానిర్దేశం చేయనున్నారు. దీనిని ప్రతి ఆరు మాసాలకు ఒకసారి నిర్వహించడంతోపాటు నియోజకవర్గాల వారీగా ఉన్న వివాదాలను కూడా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పరిశీలించి.. పరిష్కరించడం ద్వారా పార్టీలో ఇబ్బందులు రాకుండా చూడాలని పల్లా నిర్ణయించారు. దీనికి చంద్రబాబు ఆమోదం తెలిపితే.. వచ్చే నెల నుంచే కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates