పార్టీల నేతల నుంచి ఒక్కోసారి ఎదురయ్యే సమస్యలు చాలా చిత్రంగానే కాకుండా తీవ్ర పరిస్థితులకు దారితీస్తాయి. అలాంటి వాటిని హ్యాండిల్ చేయడమే పార్టీ అధినేతలకు ఉండాల్సిన కీలక వ్యూహం. ఒక్కోసారి అలా కాదని నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. పోనీ మౌనంగా ఉంటే మరింత ప్రమాదం. అంటే సమస్యను సృష్టించడం నాయకులకు తేలికే కానీ వాటిని పరిష్కరించడం పార్టీ అధినేతలకు కత్తిమీద సామేనని చెప్పాలి.
ప్రస్తుత విషయాన్ని చెప్పుకొనేముందు గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నాయకుల వివాదాలపై పెద్దగా స్పందించలేదు. అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు వరకు వివాదాల్లో చిక్కుకున్నారు. వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. ఫలితంగా ఇబ్బందులు తప్పలేదు. ఇక టీడీపీ విషయానికి వస్తే నాయకుల వ్యవహారశైలి శృతి మించుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తాజా ఘటన విషయానికి వస్తే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డు మీద పడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలోకి పాకింది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత నివేదికను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కానీ ఇక్కడే చంద్రబాబుకు పెద్ద పరీక్ష ఎదురైంది. ఇరువురు నాయకులు తనకు సన్నిహితులే కావడంతోపాటు రెండు సామాజిక వర్గాల్లోనూ చంద్రబాబుకు ఫాలోయింగ్ ఉంది. దీంతో ఎవరి మీద చర్యలు తీసుకున్నా దానిని వైసీపీ అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంది. కొలికపూడిపై చర్యలు తీసుకుంటే వెంటనే వైసీపీ ఎస్సీ కార్డును బయటకు తీసి వారి పట్ల వివక్షగా చెబుతుంది. పోనీ చిన్నిపై చర్యలు తీసుకుంటే మరో వాదనను ప్రాచారం చేసే అవకాశం ఉంది.
అందుకే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరించాలని పార్టీ అధినేత నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలో సామదాన భేదోపాయంతోనే సమస్యను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates