వైసీపీ నేతలపై తాజాగా కృష్ణాజిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రైతుల పరామర్శకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను కారణంగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జగన్ మంగళవారం.. కృష్ణాజిల్లాలో పర్యటించారు. అయితే.. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నానా హంగామా చేశారు. రహదారులకు అడ్డంగావాహనాలు ఆపడం.. ర్యాలీలు నిర్వహించడం తెలిసిందే.
నిజానికి జగన్ సహా.. కొద్ది మందికి మాత్రమే కృష్ణాజిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే.. దీనిని ఖాతరు చేయని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రి ఒకరు.. భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలను మోహరించారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఒకచోట అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుని రోగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. పామర్రు పోలీసులతో వాగ్వాదానికి దిగి.. వారిని దూషించారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా విజయవాడకు చెందిన యువ నాయకుడు ఒకరు కూడా ఇలానే చేశారని చెబుతున్నారు.
ఈ క్రమంలో సదరు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం వారికి నోటీసులు కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు. అయితే.. ఈవ్యవహారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో హాట్ టాపిక్ అయింది. ముందుగానే అనుమతి తీసుకున్నామని.. పోలీసులను కూడా అలెర్ట్ చేశామని వైసీపీ నాయకులు తెలిపారు. అయినప్పటికీ.. తమపై కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన కీలక నాయకుడు, మాజీ సలహాదారు ఒకరు.. “కేసులు పెట్టారా.. అయితే.. డిజిటల్ బుక్కు ఉందిగా అందులో రికార్డు చేయండి” అని లైట్ గా వ్యాఖ్యానించినట్టు నాయకులు చెబుతున్నారు. తాము సీరియస్‌గా తీసుకుంటే.. కీలక నేత ఇలా వ్యాఖ్యానించడం ఏంటని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates