ఈ మాట ఎవరో కాదు.. పార్టీనాయకులు, కార్యకర్తలే కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని.. రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని.. కొందరు నేతలు సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇక ప్రధాన మీడియా కూడా ఇలాంటి వార్తలను ప్రస్తావిస్తోంది. దీంతో పరిస్థితి చేయి దాటకముందే… సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి.. అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట సర్వత్రా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏం జరిగింది?
మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో ఖమ్మం, మహూబూబాబాద్, హుస్నా బాద్ సహా.. పలు ప్రాంతాల్లోని పంటలునీట మునిగాయి. సరే.. ఇది ఇలా ఉంటే.. మార్కెట్ యార్డులకు తీసుకు వచ్చి.. గత కొంతకాలంగా కొనుగోళ్ల కోసంఎదురు చూస్తున్న ధాన్యం రాసులు కూడా నీట కొట్టుకుపోయాయి. ఇది రైతన్నల కంట కన్నీరు కారిస్తోంది. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు.. పట్టుకుని.. సంచుల్లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు.. అదేసమయంలో సర్కారు ఆదుకోవాలని వారు పెడుతున్న శోకాలు కూడా.. వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.
ఇక, ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు వస్తున్న అధికారులను రైతులు చుట్టుముట్టి తమ ఆవేదనను వెల్లడిస్తున్నారు. హుస్నాబాద్‌లో అయితే.. ఓ మహిళా రైతు.. తన కష్టాన్ని వివరిస్తూ కలెక్టర్ పాదాలు పట్టుకున్నారు. పిల్ల పెళ్లి చేయాల్సివుందని.. ఈ ధాన్యం అమ్మితే వచ్చే నిధులతో పెళ్లి చేయాలని అనుకున్నామని.. ఇప్పుడు ధాన్యం నీటి పాలైందని.. తమకు ఎవరు న్యాయం చేస్తారని.. ఆమె గుండెలు బాదుకుంటూ.. కలెక్టర్ పాదాలపై పడ్డారు. ఆమెను సముదాయించలేక కలెక్టర్ తీవ్ర ప్రయాసకు గురయ్యారు.
ఇది ఒక్కటే కాదు.. వరద ప్రభావిత ప్రాంతాలు.. తీవ్ర వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లోనూ రైతులు ఇదే విధంగా విలపిస్తున్నారు. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ స్పందించి.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. రైతులకు భరోసా కలుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. లేకపోతే.. విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. క్షేత్రస్తాయిలో పర్యటించాలని కోరుతున్నారు. కేవలం ఆఫీసులో కూర్చుని ఆదుకుంటామంటే పరిస్థితి చేయి దాటుతుందని కూడా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates