గత ఎన్నికల్లో తమకు 40 శాతం మేరకు ప్రజలు ఓట్లు వేశారని వైసీపీ అధినేత జగన్ తరచుగా చెబుతున్నారు. అందుకోసమైనా.. వారి తరఫున ప్రశ్నించేందుకైనా.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన ఇటీవల కూడా ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను కూడా కోరారు. ఇదిలావుంటే.. మొంథా తుఫాను సమయంలో జగన్ అందుబాటలో లేని విషయం తెలిసిందే. తాను బెంగళూరులో ఉన్నానని.. విమాన సేవలు నిలిపివేయడంతో రాలేక పోయానని చెప్పారు.
కానీ, పార్టీ తరఫున అయినా.. కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన అనేక నిరసనలు, ధర్నాల్లో జగన్ నేరుగా ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు. కేవలం తాడేపల్లిలో కూర్చుని తన మార్గదర్శకాల మేరకు యువతను, కార్యకర్తలను ముందుకు నడిపించారు. ఇలానే.. తాజా పరిణామాల క్రమంలో ప్రజలను ఆదుకునేందుకు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను రంగంలోకి దింపి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది.
అంతేకాదు.. గత ఎన్నికల్లో తనకు ఓటేసిన 40 శాతం మంది కోసమైనా.. జగన్ ఇప్పుడు బయటకు వచ్చి ఉంటే.. బాగుండేదని కొందరు సూచిస్తున్నారు. తాజాగా సంభవించిన తుఫానులో ఆ 40 శాతం మంది ప్రజల్లో కనీసం 10-15 శాతం మందైనా ఉంటారని.. వారిని ఆదుకునేందుకు.. లేదా భరోసా కల్పించేందుకు.. ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రయత్నించి ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఇక, బాధితుల్లో వైసీపీ అభిమానులు కూడా ఉండి ఉంటారు. ఇందులో సందేహంలేదు.
మరి వారి కోసమైనా.. జగన్ బయటకు వచ్చి ఉంటే బాగుండేదన్న చర్చ ఉంది. కానీ, జగన్ మాత్రం తనకు ఓటేసిన 40 శాతం మందితో పాటు.. పార్టీ అభిమానులు, కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. కేవలం బెంగళూరుకే పరిమితమై.. వర్షాలు, తుఫాను తగ్గుముఖం పట్టాక తాడేపల్లికి చేరుకున్నారు. మరి ఈ ప్రభావం పార్టీపై పడదా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. సమయానికి తగిన విధంగా స్పందించాల్సిన జగన్.. ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదన్నది విశ్లేషకులు చెబుతున్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates