ష‌ర్మిల‌కు ఏపీ గుర్తులేదా ..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డం.. తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై ఆమె అనేక వ్యాఖ్య‌లు చేసి.. సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా న్యూస్‌గా కూడా మిగిలారు. అయితే.. పార్టీ అధిష్టానం చేసిన కొన్ని సూచ‌న‌ల‌తోపాటు.. స్థానిక నాయ‌కత్వం కూడా.. ష‌ర్మిల‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేయ‌డంతో కొన్నాళ్లుగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు త‌గ్గించారు. అంతేకా దు.. త‌ర‌చుగా ఏపీలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మొంథా తుఫాను కార‌ణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు , అదేవిధంగా మ‌త్స్య‌కారులు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయారు. వీరిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బ‌రిలో ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. మొత్తంగా స‌ర్కారు వైపు నుంచి బాగానే ప‌నిచేస్తున్నార‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన కితాబే!.

మ‌రి అంతా బాగానే చేస్తున్నార‌ని అనుకున్నారో.. లేక త‌మ అవ‌స‌రం లేద‌ని భావించారో తెలియ‌దు కానీ.. ష‌ర్మిల తాజాగా త‌లెత్తిన తుఫాను అంశాల‌పై ఎక్క‌డ స్పందించ‌లేదు. సాధార‌ణంగా గ‌త ఏడాది ఏలూరు లో ఎర్ర‌కాలువ పొంగిన‌ప్పుడు.. ష‌ర్మిల నేరుగా అక్క‌డ‌కు చేరుకున్నారు. వ‌ర‌ద‌లో మునిగిమ‌రీ రైతులు న‌ష్ట‌పోయార‌ని, వారిఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మ‌రి ఇప్పుడు ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తారా?  లేదా.. అనేది కాదు.. అస‌లు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవాలి క‌దా!.

బాధ‌ల్లో ఉన్న రైతాంగానికి అంతో ఇంతో సాయం చేసేందుకు కార్య‌క‌ర్త‌ల‌నైనా రంగంలోకి దింపాలి క‌దా. తాను స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించాలి క‌దా!… ఇలా.. అనేక ప్ర‌శ్న‌లు ష‌ర్మిల చుట్టూ తిరుగుతున్నాయి. కానీ, ఆమె ఎక్క‌డున్నారో.. పార్టీ నాయ‌కులు కూడా చెప్ప‌లేక పోతున్నార‌ట‌. ఇదిలావుంటే.. కాంగ్రెస్ త‌ర‌ఫున ర‌ఘువీరా రెడ్డి రైతుల‌ను ఆదుకుంటామ‌ని చెప్పారు. కానీ.. అస‌లు ష‌ర్మిల ఏమ‌య్యార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న కూడా స‌మాధానం చెప్ప‌లేదు. సో.. మొత్తానికి ష‌ర్మిల ఎక్క‌డున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌.