గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనేక మంది కొత్త నాయకులు విజయం దక్కించుకున్నారు. ఇలాంటి వారిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బడేటి రాధాకృష్ణ గెలుపు గుర్రం ఎక్కారు. అయితే ఈయనకు పెద్ద విశేషమే ఉంది. 2004 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో ఎవరికీ రాని మెజారిటీ ఈయనకు లభించింది.
2004లో ఆళ్ల నాని విజయం దక్కించుకున్నారు. అప్పట్లో ఆయనకు 33 వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఇదే గత ఎన్నికల వరకు ఉన్న రికార్డు. 2009లో కూడా ఆళ్ల నాని విజయం దక్కించుకున్నప్పటికీ అప్పటికి ఆయన మెజారిటీ 13 వేలకు పడిపోయింది.
ఇక 2014లో టీడీపీ తరఫున బడేటి కోట రామారావు విజయం దక్కించుకున్నారు. ఈయనకు 24 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ లభించింది. 2019లో మరోసారి ఇక్కడ ఆళ్ల నాని విజయం దక్కించుకున్నారు. ఈయనకు ఎన్నడూ లేని విధంగా కేవలం 4 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీనే లభించింది.
ఇక 2024లో మాత్రం రికార్డు సృష్టిస్తూ బడేటి రాధాకృష్ణ విజయం సాధించారు. ఈయనకు ఏకంగా 62 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ లభించింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఎమ్మెల్యేపై ప్రజలకు చాలానే ఆశలు ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరిస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఈ అంచనాలను ఆయన నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న డంపింగ్ యార్డు సమస్యను ఇటీవల పరిష్కరించారు. అలాగే సర్వజన ఆసుపత్రి సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేషన్ కార్డులు లేని వారి కోసం కార్డులు ఇప్పించే ప్రయత్నంలోనూ ఉన్నారు.
అయితే కీలకమైన సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదన్న భావన కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ–ఏలూరు రోడ్డు 6 లైన్‌ల విస్తరణ కోసం తీసుకున్న రైతుల భూముల విషయంలో పరిహారం సమస్య వెంటాడుతోంది. అలాగే ఏలూరు శివారులో కేటాయించిన జగన్‌న్న ఇళ్ల విషయం కూడా సందేహంగానే ఉంది.
దీని స్థానంలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే చెబుతున్నారు. కానీ అప్పటికే పట్టాలు ఇవ్వడంతో తమ భూములను వదులుకునేది లేదని కొందరు చెబుతున్నారు. ఇలా కొన్ని కీలక సమస్యలు ఉన్నాయి.
మార్కుల విషయానికి వస్తే సీఎం చంద్రబాబు దగ్గర మంచి మార్కులు సంపాయించుకున్నారని తెలిసింది. వివాదాలకు కడుదూరంగా ఉండడమే ఆయనకు కలిసివస్తున్న అంశమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates