మొంథా తుఫాన్… ఏపీకి ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా?

అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన మొంథా.. తీవ్ర తుఫాను మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 11 -12 గంట‌ల 30 నిమిషాల మ‌ధ్య మ‌చిలీప‌ట్నం-క‌ళింగ ప‌ట్నం మ‌ధ్య కాకినాడ‌కు దక్షిణంగా న‌ర‌సాపురం ప‌రిధిలో తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్ర‌భావం మ‌రో రెండు రోజులు కొన‌సాగుతుంద‌న్నారు. మ‌రోవైపు.. తీరం దాటిన త‌ర్వాత కూడా మొంథా తీవ్ర తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల‌పై భారీ ప్ర‌భావం చూపించింది.

తీరం దాటిన మోంథా తీవ్ర తుఫాను ప్ర‌భావంతో కుర‌స్తున్న భారీ వ‌ర్షాల‌తో పాటు ఈదురు గాలులు భారీగా వీస్తున్నాయి. గంట‌కు 70 నుంచి 90 కిలో మీట‌ర్ల వేగంతో వీస్తున్న గాలుల‌తో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగినపూడి బీచ్ రోడ్డులో కూడా విద్యుత్ వైర్లపై తాటి చెట్టు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో మచిలీపట్నం గ‌త రాత్రి అంధకారం నెల‌కొంది. కృష్ణాజిల్లాలోని మ‌చిలీప‌ట్నం స‌హా ప‌లు ప్రాంతాల్లో భారీ ప్ర‌భావం చూపింది.

తుఫాను ప్రభావంతో తీర ప్రాంత వ్యాప్తంగా తీవ్ర‌ గాలులు వీస్తున్నాయి. గాలుల ప్రభావానికి ప్ర‌ధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలతో ప‌రిస్థితి భీక‌రంగా మారింది. శ్రీకాకుళం రూరల్‌ మండలం పీజే పేట సముద్రతీరం తీవ్రంగా కోతకు గురైంది. అలల తాకిడి పెరగడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజవర్గంలో పెన్నానది పొర్లు కట్ట పొడవునా తీరంలోని ఊటుకూరు పాళెం వరకూ విస్తరించిన గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని కావలి, దగదర్తి , అల్లూరు, బోగోలు ప్రాంతాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. చిప్పలేరు, పల్లివాగు, పైడేరు, మలిదేవి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సముద్రంలో అలలు భారీగా ఎగ‌సి ప‌డుతున్నాయి. దాదాపు 74 పైచిలుకు కేంద్రాలను ఏర్పాటు చేసి.. 4 వేల మందిని అక్క‌డ‌కు తరలించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.  

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై మోంథా తీవ్ర ప్రభావం చూపింది. గడచిన 24 గంటలుగా ఏకదాటిగా పడుతున్న వర్షంతోపాటు తుఫాను తీరం దాట‌డంతో గంట‌కు 70 నుంచి 80 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రధానంగా కొబ్బరి, అరటి, వరి, ఆక్వా పంటల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ఈదురుగాలుల ప్రభావంతో గడచిన 18 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇలా 22 జిల్లాల్లో తీవ్ర ప్ర‌భావం చూపింది. ఈ న‌ష్టం సుమారు 10 వేల కోట్ల‌పైమాటే ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.