విప‌త్తుల‌తోనూ చ‌లికాచుకుంటున్నారు: చంద్ర‌బాబు

వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ప‌రోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో మొంథా తుఫాను ప్ర‌భావం క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోనే తిష్ఠ వేశారు. అధికారులు, మంత్రుల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎక్కడ ఎలాంటి ప‌రిస్థితి నెల‌కొందో తెలుసుకుని రెమెడీ సూచిస్తున్నారు.

ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి కూడా స‌మాచారం సేక‌రించేందుకు స‌చివాల‌యంలో ప్ర‌త్యేకంగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో ఓ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు వారిని కూడా త‌రుముతున్నారు. ఐఎండీ (భార‌త వాతావ‌ర‌ణ విభాగం) నుంచి స‌మాచారం సేక‌రిస్తున్నారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంతో ఇప్ప‌టికే తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం భారీ ఎత్తున ఉప‌ద్ర‌వం వ‌చ్చినా అది కేవ‌లం ర‌హ‌దారులు, చెట్లు, పొలాల‌పైనే ప‌డుతుంది త‌ప్ప ప్ర‌జ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నారు.

అంతేకాదు మంగ‌ళ‌వారం రాత్రి నుంచి బుధ‌వారంఉద‌యం వ‌ర‌కు కీల‌క స‌మ‌యంగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌చివాలయంలో ఉంటార‌ని అధికారులు చెబుతున్నారు.

ప్ర‌భుత్వం ఇంత‌గా ప్ర‌జ‌ల కోసం కృషి చేస్తుంటే మ‌రోవైపు ఈ కీల‌క స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అంతో ఇంతో అండ‌గా ఉండాల్సిన విప‌క్షం (ప్ర‌ధాన కాదు) వైసీపీ నేత‌లు కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ తుఫాన్‌పై గంద‌ర‌గోళం సృష్టించేలా క‌థ‌నాలు, పోస్టులు పెడుతున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు తాజాగా నిర్వ‌హించిన స‌మీక్షలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విప‌త్తుల‌తోనూ చ‌లికాచుకునేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అలాంటి వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌న్నారు.

ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని కూడా జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని అన్నారు. అంతేకాదు తాను కూడా ఇంట్లోనే కూర్చుని అధికారుల‌ను న‌డిపించ‌వ‌చ్చ‌ని, మంత్రుల‌కు వ‌దిలేయొచ్చ‌ని కానీ త‌న‌కు బాధ్య‌త ఉంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“ఎవ‌రూ నిరాశ ప‌డొద్దు, ప‌నిచేసేవారికే విమ‌ర్శ‌లు వ‌స్తాయి” అని ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ధైర్యం చెప్పారు.