జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ తనకు తానుగా పవన్ గురించి మాట్లాడలేదు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ రాజకీయం గురించి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పవన్ ఎక్కడ తప్పు చేస్తున్నాడో కొంత వరకు సహేతుకంగానే వివరించే ప్రయత్నం చేశాడు ప్రకాష్ రాజ్.
తర్వాత ఆయన మాట అదుపు తప్పింది. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడంటూ పవన్‌ను విమర్శించి జనసేన మద్దతుదారుల ఆగ్రహానికి గురయ్యాడు. దీనిపై పవన్ అన్నయ్య నాగబాబు తీవ్రంగా స్పందించాడు. వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రకాష్ రాజ్‌పై తన అసహనాన్ని చూపించి విమర్శల పాలయ్యాడు.
ప్రకాష్ రాజ్ విమర్శలపై నాగబాబు ఇలా స్పందించాల్సింది కాదన్న అభిప్రాయం చాలామందికి కలిగింది. నిజానికి ఆయనకు ఎలా బదులివ్వాలన్నది జనసేన నేతే అయిన దిలీప్ సుంకర చూపించాడు. అది మీడియాలో పెద్దగా హైలైట్ కాలేదు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు బాహాటంగా తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశాడు కూడా.
ఐతే ఆయన పొగిడిన కేసీఆర్ ఒకప్పుడు టీడీపీలో ఉండి.. పదవి దక్కక బయటికొచ్చి సొంతంగా పార్టీ పెట్టాడు. తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. ఆపై బయటికొచ్చి టీడీపీతో జట్టు కట్టాడు. ఆపై తెలంగాణ కల నెరవేరే సమయంలో కాంగ్రెస్‌తో సఖ్యంగా మెలిగాడు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌కు షాకిచ్చి సొంతంగా పోటీ చేసి గెలిచాడు. ఇలా ఎప్పటికప్పుడు ఆయన కూడా యుటర్న్ తీసుకున్నవాడే. మరి ఆయన్ని ఊసరవెల్లి అని ఎందుకనలేదు.. అధికారంలో ఉన్నారని భయమా అంటూ దిలీప్ సుంకర ప్రకాష్ రాజ్‌ను సూటిగా ప్రశ్నించాడు. నాగబాబు కూడా ఆవేశపడకుండా ఇలా పాయింట్ పట్టుకుని మాట్లాడి ఉంటే వ్యవహారం వేరుగా ఉండేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates