జూబ్లీహిల్స్ పోరు: అభ్య‌ర్థుల అస‌లు బెంగ ఇదే!

హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. వచ్చే నెల 11న పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం కూడా ఏర్పాట్ల‌ను ముమ్మ‌రంగా చేస్తోంది. ఇప్ప‌టికే.. ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేసింది. 4 లక్ష‌ల పైచిలుకు ఓట‌ర్లు ఉన్నార‌ని తేల్చి చెప్పింది. ఇక‌, నామినేష‌న్ల ఘ‌ట్టం అనంత‌రం.. వ‌డ‌బోత‌లు కూడా పూర్త‌య్యాయి.

వీటి ప్ర‌కారం.. మొత్తం 58 మంది అభ్య‌ర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో చిన్న చిత‌క పార్టీల‌తో పాటు ఎక్కువ మంది స్వ‌తంత్రులు కూడా ఉన్నారు. ఇలా 58 మంది అభ్య‌ర్థులు పోటీలో నిల‌వ‌డం ఇదే తొలి సారి అని జూబ్లీహిల్స్‌లో జ‌రిగిన గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే స్ప‌ష్టం అవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన పోటీ బీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్యే జ‌ర‌గ‌నుంది. ఈ మూడు పార్టీలు హోరా హోరీ ప్ర‌చారం కూడా ముమ్మ‌రం చేశాయి.

ఎవ‌రికి సంబంధించిన అంశాల‌ను వారు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్ర‌చారం సంగ‌తి పైచేయి సంగ‌తి ఎలా ఉన్నా.. ఇప్పుడు కీల‌క‌మైన ముగ్గురు అభ్య‌ర్థులు మాగంటి సునీత‌(బీఆర్ ఎస్‌), న‌వీన్ యాద‌వ్ (కాంగ్రెస్‌), లంక‌ల‌ప‌ల్లి దీప‌క్‌రెడ్డి(బీజేపీ)ల‌కు కొత్త బెంగ ప‌ట్టుకుంది. బ‌రిలో 58 మంది అభ్య‌ర్థులు ఉండ‌డంతో ఎన్నిక‌ల పోలింగ్ రోజు.. ఈవీఎంల‌పై ఇంత మంది పేర్లు ప‌ట్ట‌వు.. సో.. ఒక్కొక్క బూత్‌లో నాలుగేసి ఈవీఎంల‌ను ఏర్పాటు చేస్తామ‌ని తాజాగా ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

అంటే.. బూతులోకి వెళ్లిన ఓట‌రు.. త‌మ‌కు న‌చ్చిన కావాల్సిన అభ్య‌ర్థికి ఓటు వేయాలంటే.. ఈ నాలుగు ఈవీఎంల‌లో వారు ఎక్క‌డున్నారు? వారి ఫొటో ఏంటి? అని వెతుక్కోక త‌ప్ప‌దు. ఇది కొంత స‌మ‌యం తీసుకునే వ్య‌వ‌హారం. పైగా చ‌దువుకున్న వారు 40 శాతం మంది మాత్ర‌మే జూబ్లీహిల్స్‌లో ఉన్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. దీంతో నిర‌క్ష‌రాస్యులుగా ఉన్న వారు మ‌రింత ఇబ్బంది ప‌డ‌తారు. ఇదే ఇప్పుడు అభ్య‌ర్థుల‌కు ఇబ్బందిగా మారింది.

త‌మ పేరును ఈ నాలుగు ఈవీఎంల‌లో వెతుక్కుని.. ఓటు వేయాల్సి రావ‌డం.. దీనికి ఎక్కువ స‌మ‌యంలో ప‌ట్టే అవ‌కాశం ఉండ‌డంతో వారు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌గా త‌మ‌కు సీరియ‌ల్ నెంబ‌రు ఇవ్వాల‌ని కోరుతున్నారు. దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్న ఎన్నిక‌ల సంఘం ఈ నెంబ‌ర్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అనంత‌రం.. ఈ నెంబ‌ర్ల ఆధారంగా అభ్య‌ర్థులు ప్ర‌చారం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.