ఆస్ట్రేలియా-దుబాయ్ టూర్‌.. పెట్టుబ‌డుల లెక్క ఇదీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్‌లు విదేశాల్లో ప‌ర్య‌టించారు. నారా లోకే ష్ ప‌ర్య‌ట‌న ముగియ‌గా.. చంద్ర‌బాబు మ‌రో రెండు రోజులు కొన‌సాగించ‌నున్నారు. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌ల ప్రధాన ల‌క్ష్యం.. పెట్టుబ‌డుల వేటేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల మేర‌కు 20 ల‌క్షల ఉద్యోగాలు ఉపాధి క‌ల్ప‌న‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే తీసుకువ‌చ్చిన 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల ద్వారా  5 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ‌ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించామ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌డివ‌డిగా పెరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మ‌రిన్ని పెట్టుబ‌డుల సాధ‌న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించారు. వెళ్లిన క్ష‌ణం నుంచే ఆయ‌న‌.. పెట్టుబ‌డులు.. విద్యారంగంలో సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులు వేశారు. ప్ర‌పంచ స్థాయి సంస్థ‌ల ప్ర‌తినిధులు, అధిప‌తుల‌తోనూ భేటీ అయ్యారు. మొత్తం 5 రోజుల‌ ప‌ర్య‌ట‌న‌లో అనేక మందిని క‌లుసుకున్నారు. త‌ద్వారా.. సుమారు 2-3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పెట్టుబడులు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసుకున్నారు.

ఇక‌, చంద్ర‌బాబు దుబాయ్ స‌హా గ‌ల్ఫ్ దేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రిఫైన‌రీ, లాజిస్టిక్స్ (మెజారిటీ ఉద్యోగాలు క‌ల్పించే రంగంగా పేర్కొంటారు)ల‌లో పెట్టుబ‌డుల కోసం ప్ర‌య‌త్నించారు. మ‌రిన్ని సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను కూడా ఆయ‌న క‌లుసుకోనున్నారు. ఇక‌, అమ‌రావ‌తికి 100 కోట్ల‌తో అతి పెద్ద ప్ర‌పంచ స్థాయి గ్రంథాల‌యానికి హామీ ద‌క్కింది. అదేవిధంగా సుమారు 4-8 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అతి పెద్ద పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఎప్పుడు తేలుతుందంటే..

సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌లోనేరుగా ఒప్పందాలు జ‌ర‌గ‌క‌పోయినా.. అనేక మంది ప్ర‌ముఖ సంస్థ‌ల అధిప‌తులు ఆస‌క్తి చూపారు. వీరంతా .. వ‌చ్చే నెల‌లో విశాఖ‌లో జ‌రిగే పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు రానున్నారు. అప్పుడు.. వారి ఆస‌క్తి మేర‌కు పెట్టుబ‌డుల‌పై ఒప్పందాలు కుదుర్చుకుంటారని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సుస్థిర పాల‌న‌ను అంచ‌నా వేసుకుని తాము వేసుకున్న అంచ‌నాల‌కు మించి పెట్టుబ‌డులు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.