జగన్ కు లోకేష్ కు తేడా వివరించిన ఎమ్మెల్యే

నాయ‌కులు అంటే.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ఒక భాగం మాత్ర‌మే. వారిని మెప్పిస్తేనే తిరిగి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఇదొక్క‌టే కాదు.. క‌దా?  నాయ‌కులు అన్నాక‌.. పార్టీ నాయ‌కుల‌తోనూ మమేకం కావాలి. అప్పుడే పార్టీలోనూ నాయ‌కుల‌కు బ‌ల‌మైన నేత‌ల అండ ల‌భిస్తుంది. అంతేకానీ.. అధికారంలో లేన‌ప్పుడు.. అంద‌రూ నావార‌ని,, అధికారంలోకి వ‌చ్చాక గేట్లు వేసేస్తే.. ప‌రిస్థితి దారుణ‌మ‌నేది తెలిసిందే.

గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీనిఅధికారంలోకి తెచ్చేవ‌ర‌కు.. నాయ‌కుల‌ను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. త‌ను ఎక్క‌డున్నా వ‌చ్చి క‌లుసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. కానీ, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి 151 సీట్ల‌తో గెలిచిన త‌ర్వాత‌.. తాడేప‌ల్లి గేట్లు మూసేశారు. ఏదున్నా.. ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌కు ప‌నులు అప్పగించి వారితోనే అన్నీ చ‌క్క‌బెట్టారు. ఫ‌లితంగా జ‌గ‌న్‌కు నాయ‌కుల‌కు మ‌ధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది. మ‌రీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి వంటి నాయ‌కులే ఈ మాట చెప్పారు.

ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ నాయ‌క‌ల‌కు చేరువ అవుతున్నార‌న్న వాద‌న ఉన్నా.. గ‌తం తాలూకు అనుభ‌వాలు మాత్రం వారిని  వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో జ‌గ‌న్‌ను న‌మ్మ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో టీడీపీ విష‌యానికి వ‌స్తే.. యువ నాయ‌కుడు మంత్రి నారా లోకేష్ అటు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతూనే స‌మాంతరంగా పార్టీ నాయ‌కుల‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవ‌రు ఔన న్నా.. కాద‌న్నా.. పార్టీకి ఫ్యూచ‌ర్ నాయ‌కుడు ఆయ‌నే. సో.. అలాగ‌ని ఆయ‌నేమీ అహంకారానికి ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. నాయ‌కుల‌ను క‌లుపుకొని పోయేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ విష‌యాన్ని మైల‌వ‌రం ఎమ్మెల్యే.. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక సారి త‌ను నియోజ‌క‌వ‌ర్గం ప‌నిపై వెళ్లిన‌ప్పుడు నారా లోకేష్‌బిజీగా ఉన్నార‌ని చెప్పారు. కానీ, ఆయ‌న ఆప్యాయంగా వ‌చ్చి.. త‌న‌ను ప‌ల‌క‌రించ‌డంతోపాటు టిఫిన్ చేశారా?  కాఫీ తాగారా? అంటూ.. ప్ర‌శ్నించార‌ని అన్నారు. స‌మ‌స్య‌ల‌పైనా ఆయ‌న నోట్ రాసుకున్నార‌ని వెల్ల‌డించారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు ఈ త‌ర‌హా హాస్పిటాలిటీ(ఆతిథ్యం) ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. దీనివ‌ల్ల నాయ‌కుల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య క‌నెక్టివిటీ పెరుగుతుంద‌ని వ‌సంత తెలిపారు. సో.. ఇదీ.. లోకేష్ ఫ్యూచ‌ర్ ప్లాన్‌.