ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తరచుగా పోలీసుల వ్యవహారంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి ఆయన.. పోలీసు శాఖను తామే తీసుకునే వాళ్లమని కూడా అన్నారు. రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శించారు. అయితే.. చీటికీ మాటికీ కాకుండా.. చాలా తీవ్రమైన అంశాలు తెరమీదికి వచ్చినప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ స్పందిస్తున్నారు.
అలా.. ఇప్పుడు మరోసారి పవన్‌కల్యాణ్ భీమవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు(డీఎస్పీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా కొందరు రాజకీయ నేతలతో మిలాఖత్ అయి.. జూద శిబిరాల నిర్వహణకు పరోక్షంగా సహకరిస్తున్నారని డీఎస్పీ జయసూర్యపై ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా పలు అక్రమాల వ్యవహారంలోనూ ఆయన పేరు వినిపిస్తోందని పవన్ కల్యాణ్‌కు జనసేన నాయకులు ఫిర్యాదులు చేశారు. వీటిపై కొన్నాళ్లుగా అంతర్గత విచారణ చేయించిన డిప్యూటీ సీఎం వీటిని నిర్ధారించుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే సదరు ఆరోపణలు వచ్చిన డీఎస్పీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. తక్షణమే బదిలీ చేయలన్న ప్రతిపాదనను కూడా పెట్టినట్టు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని జనసేన పార్టీ కార్యాలయం నుంచి హోంశాఖకు, అదేవిధంగా డీజీపీ ఆఫీసుకు కూడా సమాచారం చేరింది. తక్షణమే డీఎస్పీపై చర్యలు తీసుకోవాలన్నది పవన్ కోరిక. ఈవిషయంపై హోం శాఖ ఏం చేస్తుందో చూడాలి. గతంలో తిరుపతి డీఎస్పీపై కూడా.. పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఆయనను బదిలీ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates