రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణిచేస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కొందరు గత ఐదేళ్లలో ఇష్టానుసారం వ్యవహరించారని.. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కొందరు పోలింగ్ బూతులను కూడా ఆక్రమించి ధ్వంసం చేశారని.. గత ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలను సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో అరాచక పాలన జరిగిందన్న ఆయన.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు.
పోలీసుల అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తొలుత ఆయన.. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ధైర్య సాహసాలతో పాటు అంకిత భావంతో పనిచేస్తున్న పోలీసులకు ఈ సమాజం కూడా సహకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యకు ఇప్పుడు అనేక రూపాల్లో పరిష్కారం చూపుతున్నామన్నారు.
`శక్తి` యాప్ ద్వారా.. మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా పోలీసుల పెట్రోలింగ్ పెంచామని.. నిరంతరం ప్రజల మధ్య ఉండేలా వారిని ముందుకు నడిపిస్తున్నామన్నారు. పోలీసులకు దీపావళి కానుకగా ఈఎల్స్‌ను నవంబర్, జనవరి నుంచి అందిస్తామన్నారు. ప్రజల రక్షణ కోసం బాధ్యత పోలీసులదేనన్న ముఖ్యమంత్రి.. ఈ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి ఒత్తిళ్లూ పోలీసులపై లేవని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు ప్రజల కోసం పనిచేయాలన్నారు.
అదేసమయంలో పోలీసులు విధుల్లో ఉండి.. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని చంద్రబాబు తెలిపారు. సమాజ రక్షణతోపాటు పోలీసులకు కుటుంబాలు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదని.. వారందరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates