సమాజంలో కీలకమైన స్థానంలో ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా అవమానించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వారికి గొర్రెలు, బర్రెలు మేపుకునేవారిగానే చూశారని.. అన్నారు. వారి పిల్లల చదువులకు ఏమాత్రం సహకరించలేదన్నారు. ఏటా దీపావళి పండుగకు ముందు జరుపుకొనే యాదవుల అతి పెద్ద పండుగ సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న విజ్ఞప్తినికూడా పదేళ్ల పాలనలో ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ ఉత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవులను తమ ప్రభుత్వంకడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. రాష్ట్ర సాధనలో యాదవ సామాజిక వర్గం ఎంతో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వారి పిల్లల చదువులకు కూడా సహకరిస్తామని తెలిపారు. రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీనే యాదవులకు అవకాశం కల్పించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. గత సీఎం కనీసం వారిని గుర్తించలేక పోయారని అన్నారు.
ప్రభుత్వానికి అండగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా యాదవులను కోరారు. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించేందుకు తన వంతుకృషి చేస్తానన్న ఆయన.. హైదరాబాద్ అభివృద్ధికి యాదవులు కలిసి రావాలని కోరారు. ప్రతి విషయంలోనూ యాదవులకు అండగా ఉంటామని తెలిపారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండడం గమనార్హం. యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నారు. సుమారు 50-60 వేల మంది యాదవులు ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సదర్ ఉత్సవ్‌కు హాజరుకావడం.. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates