ఏపార్టీకైనా.. నాయకులతోపాటు సంస్థాగతంగా ఉండే నేతలే కీలకం. పార్టీ జెండా పట్టాలన్నా.. పార్టీ తరఫున బలోపేతం చేయాలన్నా.. సంస్థాగతంగా ఉన్న బలం.. కీలకం. ఈ విషయంలో ఇతర పార్టీలకు భిన్నంగా టీడీపీకి బలమైన సంస్థాగత సైన్యం ఉంది. పార్టీ అనేక సందర్భాల్లో ఎత్తుపల్లాలు చవి చూసింది. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ ధాటికి.. ఆ తర్వాత.. రాష్ట్ర విభజన సమయంలోనూ పార్టీకి పెద్ద ఎత్తున పరీక్షలు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో సంస్థాగతంగా గ్రామ గ్రామానా విస్తరించిన టీడీపీ నాయకులు.. బలంగా నిలిచారు.
పార్టీని కాపాడుకున్నారు. ఇక, వైసీపీ హయాంలోనూ పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అన్న చర్చ వచ్చినప్పుడుకూడా.. సంస్థాగత నాయకత్వం బలంగా నిలబడింది. అదే.. 2024లో టీడీపీకి కలిసి వచ్చింది. కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలోకి రావడానికి సంస్థాగతంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు చాలా వరకు మేలు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేసమయంలో పార్టీ పుంజుకునేందుకు కూడా వీరు దోహద పడ్డారు. ఇక, వైసీపీకి కూడా ఇలానే సంస్థాగతంగా నాయకులు, కార్యకర్తలు ఉన్నా.. వారిని అధిష్టానం ఏమరుపాటకు గురి చేసింది. దీంతో మైనస్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ కూడా సంస్థాగతంగా పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారం లేదా.. వచ్చే నెల నుంచి జనసేన పుంజుకునేందుకు అవసరమైన సంస్థాగత పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిజానికి పార్టీ ఏర్పడి పది సంవత్సరాలు అయినా.. గ్రామంలో జండా పట్టుకునే వారు ఎక్కువగా లేరన్నది వాస్తవం. ఒక్క పవన్‌కల్యాణ్ అబిమానులు తప్ప.. పార్టీ పరంగా రాజకీయంగా కూడా జెండా పట్టుకునే వారు..బలమైన వాయిస్ వినిపించేవారు అధికంగా లేరు.
ఇప్పటికిప్పుడు పార్టీకి ఇది ఇబ్బంది కాకపోవచ్చు. కానీ.. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల నాటికి.. ప్లస్సులతో పాటు మైనస్‌లుకూడా చేరతాయి. అప్పుడు పార్టీని నిలబెట్టాలంటే ఖచ్చితంగా సంస్థాగతంగా ఉన్న నాయకుల అవసరం ఎంతైనా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్లుగా నాయకులను డెవలప్ చేయాలని బావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం సంతోషించాల్సిన విషయమని నాయకులు చెబుతున్నారు. తద్వారా పార్టీ పుంజుకుంటుందని కూడా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates