బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయన తన కోపం అంతా బీజేపీపై కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనేనని చెప్పడం తెలిసిందే. ఆది నుంచి కిషన్ రెడ్డి కేంద్రంగా ఆయన విమర్శలు కూడా గుప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పర్యటనకు ఆయన రెడీ అవుతున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అనుకూల వ్యక్తికి టికెట్ ఇచ్చిందని రాజా సింగ్ ఆరోపిస్తున్నాడు. ఆయనకు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయనుందని ప్రకటించారు. తన ప్రధాన వ్యతిరేకి కిషన్ రెడ్డేని, అయితే ఎంఐఎం తనకు ఆగర్భ శత్రువు కాబట్టి, దానికి అనుకూలమైన నాయకుడు నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇస్తున్న నేపథ్యంలో ఆయనను కూడా ఓడిస్తానని తన వంతు ప్రచారం చేస్తానని చెప్పారు. దీంతో రెండు పార్టీల్లోనూ చర్చ ప్రారంభమైంది.
ఇక జూబ్లీహిల్స్ ఉప పోరుకు సంబంధించి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరో వారంలో నామినేషన్ల పర్వం కూడా పూర్తికానుంది. అయితే కిషన్ రెడ్డి తనకు అనుకూలంగా వ్యక్తికి టికెట్ ఇవ్వించుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే రాజా రియాక్ట్ కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నవీన్ యాదవ్‌ను ప్రకటించింది. ఆయనకు ఎంఐఎం మూలాలు ఉండడంతో, ఆయనను కూడా ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తానని రాజా చెబుతున్నారు.
అయితే జూబ్లీహిల్స్‌లో రాజా ప్రభావం ఎంత? అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. హిందూ ఓటర్లలో బలమైన శక్తిగా రాజా ఉన్న విషయం తెలిసిందే. తనదైన వ్యాఖ్యలు — హిందూ ధర్మం, వారి సమస్యలు, ముస్లింలపై విరుచుకుపడటం వంటివి ఆయన గ్రాఫ్‌ను పెంచాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ మెజారిటీ ఓటు బ్యాంకు హిందువులే కావడం వల్ల వారిని ప్రభావితం చేసేందుకు ఆయన రంగంలోకి దిగితే, అది అంతిమంగా కాంగ్రెస్‌కు ఎక్కువగా నష్టం కలిగించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates