ఏపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో భారీ పెట్టుబడి రానుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద గూగుల్ పెట్టుబడిగా చెబుతున్నారు. 88 వేల కోట్ల రూపాయలను తొలిదశలో పెట్టుబడి పెట్టనున్నారు. అనంతరం దీనిని లక్షల కోట్లకు పైగానే విస్తరించనున్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను దశల వారీగా ఇవ్వనున్నారు. ఇక ఈ పెట్టుబడులతో డేటాకు సంబంధించిన అన్ని విభాగాలు విశాఖ కేంద్రంగానే సాగనున్నాయి.
ఫలితంగా విశాఖ పేరు ప్రపంచ స్థాయిలో వినిపించనుంది. అయితే దీనివల్ల స్థానికంగా ఉన్న జనాలకు జరిగే మేలెంత? అనేది కీలకం. ఎందుకంటే సీఎం చంద్రబాబుపై తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరేగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని, వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడుల పేరుతో పెద్దలకు భూములు ఇస్తున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చినా పార్టీ నాయకుల వరకే ఈ ప్రభావం కనిపించింది.
సాధారణ ప్రజల్లో ఎలాంటి పెద్ద ఊపు, ఉత్సాహం రాలేదు. దీనిని బట్టి గూగుల్ డేటా కేంద్రం వంటి అతి పెద్ద పెట్టుబడి వచ్చినా తమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అసలు ఈ డేటా సెంటర్‌తో ఒనగూరే ప్రయోజనాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది.
ఇవీ ప్రయోజనాలు:
గూగుల్ డేటా సెంటర్ రాకతో దేశ, విదేశీ రాకపోకలు విశాఖకు పెరుగుతాయి.
ఫలితంగా రవాణా రంగానికి ఇది ఊతమిస్తుంది. డ్రైవర్లు, రవాణా రంగంపై ఆధారపడిన వారికి ప్రయోజనం.
డేటా కేంద్రంలో సుమారు లక్ష మందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. వీరివల్ల స్థానికంగా ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. స్థానికులకు రాబడి వస్తుంది.
అపార్ట్‌మెంట్లు సహా సొంత ఇళ్లకు ధరలు పెరగనున్నాయి.
ఇక స్థానిక సంస్థలకు పన్నులు, సెస్సుల రూపంలో ఆదాయం పెరుగుతుంది.
స్థానికంగా చేసుకునే వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం పుంజుకుంటుంది.
మాల్స్ పెరుగుతాయి. తద్వారా స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.
ఐటీ రంగంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తాయి. ఫలితంగా స్థానిక యువత వేరే ప్రాంతాలకు వెళ్లకుండా విశాఖలోనే చదివే అవకాశం ఉంటుంది.
ఏపీలో ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
తినుబండారాలు, కేటరింగ్ సంస్థలకు కూడా మరింత పనులు లభించనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates