అణ‌చివేత‌పై అలుపెరుగని పోరుకు.. `శాంతి` స‌త్కారం: ఎవ‌రీ మ‌రియా?

ప్ర‌పంచ శాంతి దూత‌గా.. వెనుజువెలా దేశానికి చెందిన 58 ఏళ్ల మ‌రియా కొరీనా మ‌చాడో ఎంపిక‌య్యారు. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భావించే `నోబెల్ శాంతి` పుర‌స్కారానికి ఈ ఏడాది మొత్తం 16 అప్లికేష‌న్లు రాగా.. వీటిలో అంద‌రినీ తోసిరాజ‌ని మ‌రియా ఎంపిక‌య్యారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన మ‌రియా.. వెనుజువెలా స‌హా చుట్టుప‌క్క‌ల దేశాల్లోని నియంతృత్వం, పేద‌రికం, ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం నిరంత‌రం పోరాటం చేశారు. దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు ఇంట్లోనే బందీని చేసినా.. ఆమెత‌న గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. “న‌న్ను నిర్బంధించారు. కానీ, నా ఆలోచ‌న‌ల‌ను, నా తాత్విక దృక్ఫ‌థాన్ని మాత్రం నిర్బంధించ‌లే రు.“ అని ఎలుగెత్తి చాటారు. వెనుజువెలా పౌరుల హ‌క్కుల కోసం.. జీవితాన్ని త్యాగం చేశారు.

అంతేకాదు.. ఒకానొక ద‌శ‌లో ఆమె ఒంట‌ర‌య్యారు. త‌న చుట్టూ ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేరు. ఉంటే.. వారిపై కాల్పులో..లేక కేసులో.. అనే ధోర‌ణిలో వెనుజువెలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. దీంతో మ‌రియాను అంద‌రూ వ‌దిలేశారు. అంతేకాదు.. ఉద్య‌మాన్ని వ‌దిలేస్తే.. కీల‌క ప‌ద‌వులు ఇస్తామ‌న్న ఆఫ‌ర్లు వెంటాడాయి. అయినా.. మ‌రియా వెన్ను చూప‌లేదు. నిర్బంధించి.. నీళ్లు ఇవ్వ‌క‌పోయినా.. కూడా త‌న ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. ప్ర‌జాస్వామ్యం కోసం.. ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ఆమె నిరంత‌రం పోరాట స్ఫూర్తిని ర‌గిలించారు. ముఖ్యంగా వెనుజువెలా అంటేనే.. క‌మ్యూనిస్టు ఫాసిస్టు చ‌రిత్ర‌కు ప్ర‌తీక‌గా పేరొందింది. నోరు విప్పేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌లేని ప‌రిస్థితి కూడా ఉంది.

అలాంటి స‌మ‌యంలోనే మ‌రియా త‌న గ‌ళం వినిపించారు. 1967, అక్టోబరు 7న జన్మించిన మ‌రియా.. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటెనియా ఫౌండేషన్‌ను స్థాపించారు. అనంత‌రం.. ఆమె ప్ర‌జ‌ల హ‌క్కులు, ప్రజాస్వామ్య విలువల ప‌రిర‌క్ష‌ణ కోసం కాలు క‌దిపారు. ఆ సమయంలో ఆమెపై దేశ ద్రోహం, కుట్ర కేసులు న‌మోదు చేసి.. 21 సంవ‌త్స‌రాల పాటు ఇంటికే బంధీని చేశారు. ఇక‌, 2002లో ‘వెంటే వెనెజువెలా’ పేరుతో లిబరల్ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచారు.

అయినా.. ఇక్క‌ట్లే..

ఏ ప్ర‌జ‌ల కోసం మ‌రియా గళం విప్పారో.. వారు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ప్ప‌టికీ.. కేసులు వెంటాడాయి. ఈ క్ర‌మంలోనే ఆమెపై వెనుజువెలా అసెంబ్లీ ఆమె అభ్య‌ర్థిత్వాన్ని ర‌ద్దు చేసింది. దీనికి కార‌ణం..తాము వ్య‌తిరేకించే అమెరికాతో చేతులు క‌లప‌డ‌మేన‌ని పేర్కొంది. వాస్త‌వానికి.. ప్ర‌జాస్వామ్యం కోసం.. ఎవ‌రితో అయినా చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌ని మ‌రియా ప్ర‌క‌టించారు. ఇదే ఆమెకు శాపంగా మారింది. అనంత‌రం.. 2024లో(గ‌త ఏడాది) జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష పీఠానికి ఆమె పోటీ చేయాల‌ని భావించారు. కానీ, అప్ప‌టికే ఉన్న కేసుల నేప‌థ్యంలో ఎన్నిక ల‌సంఘం ఆమెపై అన‌ర్హ‌త వేసింది. అయిన‌ప్ప‌టికీ మ‌రియా త‌న పోరు సాగిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ శాంతి దూత‌గా ఆమెను నోబెల్ వ‌రించింది.