నిజమే. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేస్తున్న నిర్మాణాత్మక అడుగులతో ఉప్పాడకు ఊపిరి వచ్చేసినట్టే. అదేదో ఏడాదో, రెండేళ్లో కాదు… శాశ్వతంగా ఉప్పాడ సమస్యకు పరిష్కారం లభించినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా నెల రోజుల క్రితం ఉప్పాడలో పడిపోయిన కొబ్బరి తోటలను తాను అక్టోబర్ 9న పరిశీలిస్తానని పవన్ గత నెలలోనే ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు పవన్ గురువారం కోనసీమ పరిధిలోని ఉప్పాడలో పర్యటించనున్నారు. అనంతరం ఆయన తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ పర్యటిస్తారు.
ఏటా వర్షాకాలంలో ఉప్పాడ తీరంలోకి సముద్రపు ఉప్పు నీరు చేరిపోతోంది. ఫలితంగా అక్కడి నీరంతా ఉప్పు నీరుగా మారిపోతోంది. ఇక ఈ ఏడాది అయితే భారీ వర్షాలు, వరదలకు ఉప్పాడ తీరంలోని కొబ్బరి తోటలు, ఇతర వాణిజ్య పంటలన్నీ నేలకూలాయి. ఈ తరహా పరిస్థితి ఏళ్ల తరబడి తరచూ కనిపిస్తున్నదే. అయితే ఏ ఒక్క నాయకుడు కూడా ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ ఏడాది రైతులు విషయాన్ని పవన్ కల్యాణ్ కు చేరవేయగా… పవన్ వెంటనే స్పందించారు. ఉప్పాడ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని అన్నదాతలకు మాటిచ్చారు.
మాటిచ్చి మరిచిపోయే నేతలున్న ఈ కాలంలో పవన్ తన పర్యటనకు ముందే అసలు ఉప్పాడ సమస్య పరిష్కారానికి ఏఏ చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఏకంగా ఓ కమిటీనే ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయ, సాగునీరు, పర్యావరణ, వాతావరణ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి, కొబ్బరి పరిశోధన సంస్థ ప్రతినిధులను నియమించారు. ఈ కమిటీ ఇప్పటికే ఉప్పాడలో అవిశ్రాంతంగా పర్యటించి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పలు చర్యలను సిద్ధం చేసినట్టు సమాచారం.
ఇక పవన్ పర్యటన విషయానికి వస్తే…గురువారం ఉదయం నేరుగా ఉప్పాడ తీరం చేరుకునే పవన్ అక్కడ నాశనమైన కొబ్బరి తోటలను పరిశీలిస్తారు. అనంతరం సముద్రంలో బోటులో ప్రయాణిస్తూ అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉప్పాడలోనే ఆయన అన్నదాతలతో మాట్లాడతారు. ఉప్పాడ సమస్య పరిష్కారానికి తీసుకోబోయే చర్యలను కూడా ఆయన వారికి వివరిస్తారు. అనంతరం పిఠాపురం వెళ్లనున్న పవన్ అక్కడ పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates