తెలంగాణలో రెండు కీలక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కానీ పార్టీ నేతల మధ్య ఐక్యత నినాదం కొనసాగుతున్నా, మంత్రుల మధ్య మాత్రం విభేదాల మంటలు చెలరేగుతున్నాయి.
తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం పెద్దదిగా మారింది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో అడ్లూరికి అవకాశం దక్కగా, తాను పీఠం దక్కించుకున్న తర్వాత కొందరు మంత్రులు తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందులో ముఖ్యంగా పొన్నం ప్రవర్తనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
రహ్మత్‌నగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పొన్నం తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అడ్లూరి ఆరోపించారు. “నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని. ప్రజల ఓట్లతో గెలిచాను. ఎవరి జోలికి వెళ్లి పదవులు సంపాదించుకోలేదు. పొన్నం ప్రభాకర్ నా జోలికి రాకుండా ఉండటం మంచిది. లేకపోతే ఫలితాలు ఆయనే భరించాలి” అని అడ్లూరి సూటిగా హెచ్చరించారు.
ఇక దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “ఆయన మనసు నొచ్చుకున్నందుకు నేను విచారిస్తున్నా. రాజకీయ దురుద్దేశంతో నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. నా ఉద్దేశం ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు” అని స్పష్టీకరించారు.
ఈ మాటల యుద్ధం కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్తతను మరింత పెంచింది. ముఖ్యంగా కుల వివాదం రూపం దాల్చిన ఈ వ్యవహారం ఎన్నికల ముందు పార్టీకి ఇబ్బందులు తెచ్చే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates