కూట‌మి ఉండ‌దు: జ‌గ‌న్ జోస్యం

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా త‌న పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లతో తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో భేటీ అయ్యారు. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక ల ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. గ‌త 2021లో జ‌రిగిన స్థానికం లో వైసీపీ భారీగా విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో అదే హ‌వాను కొన‌సాగించాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌.. పార్టీ కీల‌క నాయ‌కుల‌తో భేటీ అయ్యారు.

పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వ వైఫల్యాల పై తదితర అంశాలపై చర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న‌ కూట‌మి.. బ‌ల‌హీనంగా ఉంద‌న్నారు. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగాయ‌ని.. వాటిని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవాల‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో ఇటీవ‌ల చిరంజీవిని బాల‌య్య అవ‌మానించేలా వ్యాఖ్య‌లు చేయ‌డం.. చంద్ర‌బాబు.. ప‌వ‌న్ ఇంటికి వెళ్ల‌డం.. ఇలా.. కూట‌మిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌స్తావించారు.

ఈ నేప‌థ్యంలో కూట‌మి పైకి బాగున్నా.. మేడి పండు మాదిరిగా ఉంద‌న్న జ‌గ‌న్‌.. వైసీపీ నాయ‌కులు ఎక్కడిక‌క్క‌డ పుంజుకోవాల‌ని సూచించారు. కూట‌మి వైఫ‌ల్యాల‌కు తోడు.. పార్టీల్లో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాటల‌ను కూడా.. వైసీపీకి అనుకూలంగా మార్చాల‌ని ఆయ‌న సూచించారు. ఎవ‌రు పార్టీలోకి వస్తామ‌ని చెప్పినా.. వెంట‌నే ఆహ్వానించి.. కండువా క‌ప్పాల‌న్నారు. స్థానిక సంస్థ‌ల విజ‌యం అంతా.. మీ చేతుల్లోనే ఉందని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను కేవ‌లం స‌ల‌హాలు సూచ‌న‌లు మాత్ర‌మే ఇస్తాన‌ని తేల్చి చెప్పారు.

వ‌చ్చే స్థానికంలో మెజారిటీ స్థానాలు గెలిపించుకుని వ‌చ్చిన వారికి మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప్రాధాన్యం ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్ప‌డం విశేషం. అంతేకాదు.. వారికి పార్టీలో ప్రాధాన్యం మ‌రింత పెరుగుతుంద‌న్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీగా ఉంద‌న్న జ‌గ‌న్‌.. మ‌నం కూడా అదేస్థాయిలో పోరాటానికి రెడీ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేల్చి చెప్పారు. ముఖ్యంగా కూట‌మి ఎక్కువ కాలం మ‌న‌లేద‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు కొత్త‌కాదు. గ‌తంలోనూ ఆయ‌న ఇవే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.