ఏపీలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో ఆయన తక్షణమే స్పందించారు. పార్టీ నాయకులపై వేటు వేశారు. ఇదే సమయంలో అధికారులతోను, మంత్రులతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
నకిలీ మద్యం తయారీ, విక్రయాల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెరవెనుక ఎవరున్నారో చూడాలన్నారు.
ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా ఎవరెవరితోనో చేతులు కలిపితే.. మిమ్మల్ని కూడా ఉపేక్షించేది లేదు. నకిలీ మద్యం వ్యవహారంలో ఇతర పార్టీ నాయకుల ప్రమేయాన్ని కూడా బయటకు లాగాలి. ఎవరున్నా.. ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దు. అని చంద్రబాబు ఆదేశించారు.
తెనాలికి చెందిన ఓ వైసీపీ కీలక నేత సహచరుడు మద్యం కేసులో ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఎవరినీ వదిలి పెట్టొద్దని ప్రత్యేక అధికారాలు కూడా వాడుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం పై పోరాడిన పార్టీగా ప్రజలలో టీడీపీకి గుర్తింపు ఉందని, ఇప్పుడు ఆ పేరు పోవకూడదని, కొందరు చేస్తున్న కుట్రలను అరికట్టాలని ఆయన కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates