హైదరాబాద్‌లో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న ఈ ఉప ఎన్నికకు డేట్ ఫిక్స్ చేసింది. నవంబరు 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అయితే.. నామినేషన్ల ప్రక్రియ.. ఉపసంహరణ వంటి కీలక అంశాలపై మరోసారి నోటిఫికేషన్ వెలువడ నుంది. ఇక, ఈ ఎన్నికల ఫలితాలను.. నవంబరు 14న వెల్లడిస్తారు.
మొత్తం ఈవీఎం ఆధారంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా సీఈసీ.. జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయా వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను విడుదల చేశామన్న ఆయన.. కొత్తగా ఓటు వేసేవారికి కూడా అవకాశం కల్పించినట్టు తెలిపారు. కాగా.. సోమవారం నుంచే జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
ఉప ఎన్నిక వెనుక..
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ ఎస్ పార్టీ దక్కించుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త, నిర్మాత మాగంటి గోపీనాథ్ ఈ స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట ఆయన తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఫలితంగా చట్ట సభ్యుడు మృతి చెందినా.. రాజీనామా చేసినా.. నిబంధనల మేరకు ఆరు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక, జూబ్లీహిల్స్‌లో మొత్తం 3,98.982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.7 లక్షల మంది మహిళలు కాగా.. 80 వేల మంది 22 ఏళ్లలోపు ఉన్నవారు ఉన్నారు. మొత్తంగా కొత్త ఓటర్లకు ఈ దఫా ప్రాధాన్యం పెరిగింది. ఈ నెల 13న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక, ప్రధానంగా మూడు పార్టీలమధ్య హోరా హోరీ పోరు జరగనుందని పరిశీలకులు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్, బీజేపీలు తలపడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates