హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఘట్టం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థుల ఎంపికై కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నలుగురి పేర్లతో పార్టీ అధిష్టానానికి నివేదిక పంపించింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించేసింది. మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు బీఆర్ ఎస్ టికెట్ ఖరారు చేసింది.
ఇక, ఇప్పుడు బీజేపీ వంతు కూడా వచ్చింది. ఈ పార్టీ స్థానిక నాయకులు.. పార్టీ చీఫ్ రామచంద్రరావు.. ముగ్గురి పేర్లతో కూడిన నివేదికను పార్టీఅధిష్టానానికి పంపించారు. అయితే.. వీరిలో ముగ్గురూ కూడా.. అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. ఒకరు కమ్మ సామాజిక వర్గానికి, మరో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. పైగా వీరిలో ఒకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. దీంతో ఈ ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.
ఎవరెవరు?
గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన.. లంకల దీపక్ రెడ్డి పేరు ను ఫస్ట్‌లో పేర్కొన్నారు. ఈయన కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ ఇంచార్జ్‌గా కూడా కొనసాగుతున్నారు. మిగిలిన ఇద్దరూ కూడా మహిళా నాయకులు. ఒకరు వీరపనేని పద్మ, మరొకరు.. జూటూరు కీర్తి రెడ్డి. వీరిద్దరూ కూడా పార్టీలో బలమైన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికంగా కూడా వ్యాపారాలు, వ్యవహారాలు చక్కబెడుతున్నారు.
ప్రస్తుతం బీఆర్ ఎస్.. జూబ్లీహిల్స్‌లో రెండు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 1) మహిళా సెంటిమెంటు.. 2) ప్రభుత్వ వ్యతిరేకత. దీనిలో బీజేపీ మహిళా సెంటిమెంటును అడ్డుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జూటూరు కీర్తి రెడ్డి లేదా.. బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సొంత సామాజిక వర్గానికి చెందిన వీరపనేని పద్మకు అవకాశం ఇచ్చే చాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇప్పుడు బీజేపీ కూడా జూబ్లీహిల్స్‌పై మాస్టర్ ప్లాన్ వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates