స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన. దీనిపైనే ఆశలు భారీగా కూడా పెట్టుకున్నారు. అయితే, రిజర్వేషన్ అంశం ఒక పట్టాన కొలిక్కిరావడం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు సర్కారుకు కలిసి వచ్చినా.. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న గవర్నర్, రాష్ట్రపతి మాత్రం ఇప్పటి వరకు ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. దీంతో ప్రత్యేకంగా ఓ జీవోను తీసుకువచ్చారు.
దీనిపై మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న బిల్లులపై జీవో ఎలా తీసుకువస్తారని ప్రశ్నించింది. ఈ విచారణను వాయిదా వేసింది. అయితే.. హైకోర్టు ఎలాంటి నిర్నయం తీసుకోలేదు. అంటే.. 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవోపై స్టే విధించడం కానీ.. అమలు చేయాలని కానీ.. చెప్పలేదు. దీంతో పిటిషనర్ ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఇటు సర్కారు కూడా బలమైన న్యాయవాదులనే పెట్టింది. గంటల చొప్పున తమ డ్యూటీకి లెక్కకట్టి లక్షలు తీసుకునే అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ దవే వంటివారిని రంగంలోకి దింపింది. అంతేకాదు.. ఈ న్యాయ ప్రక్రియను నేరుగా పరిశీలించేందుకు మంత్రులు పొన్న ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీకి వెళ్లి.. కోర్టులో హాజరయ్యారు కూడా. మొత్తానికి సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేవేయడంతోపాటు.. ఏదైనా కూడా హైకోర్టులో తేల్చుకోవాలని తేల్చి చెప్పింది.
ఇక, ఈ వ్యవహారం తమకు కలిసి వచ్చిందని మల్లు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. స్థానికంలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. కానీ, హైకోర్టులో కేసు వి చారణలోనే ఉందన్న విషయాన్ని ఆయన మరిచిపోయారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇతర పార్టీలు కూడా ప్రభుత్వ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయి.. బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా. సుప్రీంకోర్టులో కూడా.. హైకోర్టు ఆదేశాలపై స్పష్టత రాకపోవడం.. మరో వైపు రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates